ఈ విషయాన్ని టీటీడీ పునరాలోచించాలి.. అప్పుడే తుది నిర్ణయం
తిరుమల కొండపైకి ప్రయాణించే ఘాట్ రోడ్లలో కమర్షియల్ బైక్ టాక్సీల ప్రవేశంపై తిరుమల తిరుపతి దేవస్థానం విధించిన నిషేధం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో ఇటీవల సంబవించిన రోడ్డు ప్రమాదంలో వాహనదారుడు మృతి చెందగా, వెనుక కూర్చున్న తిరుమల యాత్రికుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ.. తక్షణ నివారణ చర్యగా ఘాట్ రోడ్లపై కమర్షియల్ బైక్ టాక్సీల ప్రయాణాన్ని నిషేధించింది.
ఇది.. రాపిడో, ఓలా, ఉబెర్ వంటి యాప్-బేస్డ్ బైక్ టాక్సీలకు వర్తిస్తుంది. భక్తులు ఉపయోగించే వ్యక్తిగత లేదా ప్రైవేట్ ద్విచక్ర వాహనాలకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు. వాహన తనిఖీల కోసం అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు బైక్ టాక్సీలకు అనుమతి లేదంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు బైక్ రైడ్ బుక్ చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా సంస్థలకు కూడా టీటీడీ సూచించింది.

ఘాట్ రోడ్లపై బైక్ టాక్సీలపై విధించిన ఈ నిషేధాన్ని పునఃపరిశీలించాల్సిందిగా సెంటర్ ఫర్ లిబర్టీ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎఫ్ఎల్ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ ఈఓకు లేఖ రాశారు. ప్రైవేట్ కార్లకు డబ్బు ఖర్చు చేయలేని సామాన్య భక్తులకు కమర్షియల్ బైక్ సేవలు చవగ్గా రవాణా సేవలను అందజేస్తోన్నాయని గుర్తు చేశారు.
బైక్ టాక్సీలపై పూర్తిగా నిషేధం విధించడం కంటే సామాన్య భక్తుల ప్రయోజనాల కోసం కఠిన భద్రతా నిబంధనలను అమలు చేయాలని ఆయన సూచించారు. ఘాట్ రోడ్డు రవాణాలో భద్రతను పెంపొందించడానికి వీలుగా ప్రతి బైక్ టాక్సీ వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్, కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం, ప్రమాదాలకు గురయ్యే వాహనదారుల లైసెన్సులను రద్దు చేసి, వారిని ఘాట్ రోడ్లపైకి రాకుండా బ్లాక్ చేయాలని చెప్పారు.
యాప్ ఆధారిత వాహన సంస్థలను ప్రయాణికుల భద్రత పట్ల జవాబుదారీగా చేయాలని చక్రవర్తి తన లేఖలో కోరారు. ప్రమాదం సంభవిస్తే ప్రయాణికులకు తక్షణమే వైద్య సహాయం అందించడం, బీమా కవరేజ్ కల్పించే బాధ్యతను సదరు కంపెనీలకే అప్పగించాలని అన్నారు. ఒక ప్రమాదాన్ని సాకుగా చూపి మొత్తం సేవలను నిలిపివేయడం సరికాదని, సురక్షిత మార్గదర్శకాలతో బైక్ టాక్సీ ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల లక్షలాది మంది పేద యాత్రికులకు సేవలు అందించినట్టవుతుందని పేర్కొన్నారు.
మరోవైపు.. వందలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న బైక్ ట్యాక్సీలను ఉన్నపళంగా నిషేధం విధించడం పట్ల ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. భద్రతకు సంబంధించి వివిధ వర్గాల నుంచి వస్తున్న వినతులను పరిశీలిస్తోన్నట్లు టీటీడీ పాలకమండలి వర్గాలు తెలిపాయి. కొండపైకి ప్రయాణించే భక్తుల భద్రత పరంగా తలెత్తే పరిణామాలను అంచనా వేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
