కీలక నియోజకవర్గంలో చంద్రబాబు గురి తప్పుతోందా..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠ పెంచుతుంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులపై దాదాపు క్లారిటీ వచ్చింది. టిడిపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీకి తొలినుంచి మద్దతుగా అరుస్తున్న నియోజకవర్గాల్లో కచ్చితంగా గెలవాలని ప్లాన్ చేస్తుంది. అయితే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మాత్రం పరిస్థితి భిన్నంగా మారుతోంది.
చంద్రబాబు నిర్ణయం
2019 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాను వైసిపి క్లీన్ స్వీప్ చేసింది. తిరిగి జిల్లాపై పట్టు నిలబెట్టుకునేందుకు చంద్రబాబు అభ్యర్థులు ఎంపికపై వ్యూహత్మకంగా వ్యవహరించారు. వైసీపీ నుంచి దాదాపు సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించారు. శృంగవరపు కోట అసెంబ్లీ నియోజకవర్గంలో 2009 2014లో వరుసగా కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాసరావు చేతిలో లలిత కుమారి ఓడిపోయారు. 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో గొంపా కృష్ణ టిడిపి తరఫున పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో శోభ హైమావతి పార్టీని వీడాక ఎన్ఆర్ఐ అయిన గొంప కృష్ణ పార్టీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీని నిలబెట్టేందుకు పలు చర్యలు తీసుకున్నారు.

పార్టీలో కీలకంగా
యువజన సంఘాలను గొంప కృష్ణ ప్రోత్సహించారు. ఈసారి ఎన్నికల్లో సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. సీటు దక్కితే కృష్ణ గెలుపు ఖాయమని అంచనాలు వినిపించాయి. కోళ్ల లలితను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించిన టిడిపి, గొంప కృష్ణకు రాష్ట్రస్థాయిలో బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కోళ్ల లలితకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. నియోజకవర్గంలో ఎంతో ఖర్చు పెట్టి పార్టీ కోసం పనిచేసిన తనను పక్కన పెట్టడం పైన గొంప కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు టీడీపీ యువనేత నారా లోకేశ్ సైతం శృంగవరపు కోట టికెట్ గొంప కృష్ణకే అని హామీ కూడా ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో కృష్ణకు కాంకుడా కోళ్ల లలితకు టికెట్ కేటాయించడంతో కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే పార్టీకి నష్టం తప్పదని స్థానిక కేడర్ వాపోతోంది.

నిర్ణయం మారేనా
పార్టీ కోసం పనిచేసిన కృష్ణకు సీటు ఇవ్వాలని అధినాయకత్వానికి విజ్ఞప్తులు పంపుతున్నారు. అయితే కోళ్ల లలిత తానే అభ్యర్థిగా బరిలో ఉంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గంగా ఉన్న శృంగవరపుకోటలో గొంప కృష్ణను ఇప్పుడు చంద్రబాబు బుజ్గగించే ప్రయత్నం చేస్తారా, లేక ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే కృష్ణ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. జిల్లా పార్టీ నాయకత్వం మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. కోళ్ల లలితకుమారీ పై గొంప కృష్ణకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. దీంతో శృంగవరపుకోటలో చంద్రబాబు తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications