వైసీపీ దాడులకు తెగబడుతోంది- 356 మినహా మార్గం లేదు : రాష్ట్రపతి-ప్రధానికి చంద్రబాబు లేఖ..!!
టీడీపీ కార్యాలయాలపైన జరిగిన దాడుల విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దాడి జరిగిన వెంటనే గవర్నర్ తో పాటుగా అమిత్ షా కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన చంద్రబాబు తాజాగా రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 39 పేజీలతో కూడిన లేఖలు రాశారు. అరాచక పరిస్థితులు నెలకొన్న ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని పునరుద్ధరించి రాజ్యాంగ బద్ధ పాలన నెలకొనేలా చేయడానికి మరో మార్గం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

ఉద్దేశ పూర్వకంగానే జరిగిన దాడులు
ఈ దాడులు అనుకోకుండా జరిగినవి కావని... రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామిక సంస్ధలైన రాజకీయ పార్టీలు, శాసన, న్యాయ, అధికార వ్యవస్థ, మీడియాపై అధికార పార్టీ తెగబడి దాడులు చేస్తోందని లేఖలో ఫిర్యాదు చేసారు. దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఈ దాడులు జరిగాయని వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు స్తంభించాయని పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన విధించడానికి ఇంతకంటే అర్హమైన పరిస్థితి మరొకటి ఉండబోదని చెబుతూ... అందుకే రాష్ట్రపతి పాలనను కోరుతున్నామని చంద్రబాబు తన లేఖలో వివరించారు.

ఇవే ఆధారాలు..పోలీసుల సహకారం
పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై జరిగిన దాడులకు సంబంధించి పలు ఫొటోలు, పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులు, వీడియోలను జతచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సాగు, రవాణా, వ్యాపారం, వాడకం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితిని ఎత్తి చూపినందుకు ఆగ్రహంతో ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని, అధికారం అండతో జరిగిన ఈ దాడికి పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు, కార్యాలయాలకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు.

దేశ చరిత్రలోనే ఇలాంటి పరిస్థితి లేదు
దేశ చరిత్రలో అధికార పార్టీ గూండాలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం ఇంతవరకూ జరగలేదని, ఆ రికార్డు కూడా వైసీపీ పాలనలో ఈ రాష్ట్రానికే దక్కిందని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ కార్యాలయం పోలీస్ డీజీపీ కార్యాలయానికి కిలోమీటరు దూరంలోనే ఉందని వివరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కూడా 15 నిమిషాల ప్రయాణ వ్యవధిలోపే ఉందంటూ... ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ కూడా ఒక కిలోమీటర్ లోపులోనే ఉందని చెప్పుకొచ్చారు.
Recommended Video

అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోరుతూ
ఇలాంటి ప్రాంతంలో ఉన్న రాజకీయ పార్టీ కార్యాలయంపైకి వందల మంది గూండాలు దాడి చేసి విధ్వంసం సృష్టించారని ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ పెరిగిపోవడంపై టీడీపీ ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాతే దాడులు జరిగాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇక, ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి.. కేంద్ర హోం మంత్రిని కలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి అప్పాయింట్ మెంట్ కోరుతూ లేఖలు పంపారు. ఈ ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తున్నారు. అప్పాయింట్ మెంట్ ఖరారు కాగానే..చంద్రబాబు ఢిల్లీ వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. తమ పార్టీ కార్యాలయాల పైన జరిగిన దాడి అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రధాన అంశంగా ప్రస్తావిస్తూ..జాతీయ నేతలను మద్దతు కోరేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications