చంద్రబాబు, రేవంత్ సమావేశం - ఏం జరుగుతోంది..!?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో ఎన్నికల పొత్తుల పైన చర్చలు జరుగుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరటం ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీ సీట్ల పైన రెండు పార్టీల మధ్య సర్దుబాటు ఫైనల్ కావాల్సి ఉంది. ఆ తరువాత అధికారికంగా పొత్తులపైన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే పొత్తుల కోసం ఢిల్లీ వెళ్తున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ తో టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రాంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
ఏపీలో ఈ సారి ఎన్నికలు చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖాయమైంది. బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు కోరుతున్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు పైన చర్చలు జరుగుతున్నాయి. అటు బీజేపీ ఇదే సమయంలో టీడీపీ తో ద్విముఖ వ్యూహం అమలు చేస్తోంది. సొంతంగా పోటీకి సిద్దం అవుతూనే.. తాము కోరిన సీట్లను పొత్తులో భాగంగా దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇటు ఢిల్లీకి బీజేపీతో పొత్తు చర్చలకు వెళ్తున్న సమయంలోనే చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ సీఎం రేవంత్ తో రెడ్డి తో సమావేశం అయినట్లు ప్రచారం సాగుతోంది.

అటు రేవంత్ సైతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల ఖరారు పైన చర్చల కోసం ఢిల్లీకి వెళ్లారు. ఆ సమయంలో ఇద్దరు నేతలు విమానాశ్రయంలో కలిసి ప్రస్తుత రాజకీయాలపైన చర్చలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూనే ఇటు రేవంత్ తో సమావేశం కావటం పైన సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయి. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. నేరుగా రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లి మద్దతు ప్రకటించారు. ఆ తరువాత కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేసారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏలోకి చేరాలని భావిస్తున్న సమయంలో ఈ భేటీ పైన రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications