ప్రభుత్వానికి సమయం ఇద్దాం: నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉంటాం: అధైర్యం వద్దు..చంద్రబాబు..!
ఏపీలో ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల ముందుకొచ్చారు. ఎన్నికల్లో ఓటమితో బాధలో ఉన్న పార్టీ నేతలకు..కార్యకర్తలకు ఓదార్పు ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్టీఆర్ సైతం ఓడిపోయారని..కానీ, ఎప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేసారు. ఇదే సమయంలో తమ భవిష్యత్ ఏంటనేది కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేసారు.
ప్రభుత్వానికి సమయం ఇద్దాం...
ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత తొలిసారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు కొందరు భావోద్వేగానికి గురవ్వగా చంద్రబాబు ఓదార్చారు. ఆ తరువాత తన ప్రసంగంలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ సైతం ఓడిపోయారని..ఏనాడు మనో నిబ్బరం కోల్పోలేదని గుర్తు చేసారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నేతలు సైతం అదే స్పూర్తితో ముందెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసారని..జెండాలు మోసారని వివరించారు. తన పాలన సమయంలో అభివృద్ది - సంక్షేమం కోసం ముందుకెళ్లామని వివరించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పని చేసామని గుర్తు చేసారు. అయితే కొందరు కార్యకర్తలు బాధ పడుతున్నారని..ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. జీవితంలో ఇబ్బందులు వస్తాయని అందరం జరిగిన తప్పులు ఎక్కడో చూసుకొని సరి చేసుకుంటూ ముందుకు వెళ్దామన్నారు. కొత్త ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని..ఏం చేస్తారో చూద్దామని..కొంత సమయం ఇద్దామంటూ వ్యాఖ్యానించారు.

నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిద్దాం..
తెలుగు దేశం పార్టీ మూడున్నార దశాబ్దాలుగా ఎన్నో ఆటు పోట్లు చూసిందన్న చంద్రబాబు తాను అన్ని సమయాల్లో కార్యకర్తలకు అండగా ఉన్నానని..ఇప్పుడు కూడా ఉంటానంటూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఏపీలో మనం నిర్మాణాత్మక ప్రతిపోంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రజలు 40 శాతం ఓట్లు టీడీపీకే వేసారని.. ప్రజల తరపున అండగా నిలవాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉందన్నారు. అన్ని స్థాయల్లో సమీక్షలు చేసుకుందాం.. తప్పులు ఉంటే సరి దిద్దకుందామని పేర్కొన్నారు. ప్రజలకు అంకిత భావంతో పని చేద్దామని పిలుపునిచ్చిన చంద్రబాబు టీడీపీ ప్రజల పార్టీ అని...అటువంటి పార్టీ కోసం అంకిత భావంతో పని చేసి పూర్వ వైభవం సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దరని..లక్ష్యాన్ని చేరుకొనే వరకూ పోరాటం చేద్దామని సూచించారు.












Click it and Unblock the Notifications