ముమ్మాటికి ప్రభుత్వ కుట్రే - టీచర్ల పోరాటానికి టీడీపీ మద్దతు : చంద్రబాబు హామీ..!!
విద్యా శాఖలో మున్సిపల్ పాఠశాలల విలీనం ప్రభుత్వ కుట్రగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పురపాలక స్కూళ్ల విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమన్నారు. 2115 పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కొట్టేయ్యడానికే జగన్ కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నాలుగున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు.
నిన్నటి వరకు ఎయిడెడ్ స్కూళ్లను టార్గెట్ చేసిన ప్రభుత్వం...ఇప్పుడు మునిసిపల్ స్కూళ్ల ఆస్తులపై కన్నేయడం దారుణమన్నారు. విలీన ప్రతిపాదనపై మున్సిపల్ టీచర్ల పోరాటానికి టీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మునిసిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలీదా అని నిలదీసారు.ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. హైకోర్టు ఉమ్మడి సర్వీసు రూల్సుకు వ్యతిరేకంగా ఉన్నా ప్రభుత్వం ముందుకు వెళ్లాలనే ఆలోచన పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇప్పటికే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ చంద్రబాబు ఆరోపించారు. పదో తరగతి పరీక్షా ఫలితాల అంశం పైన టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్దం సాగింది. ఇక, తాజాగా జనసేన అధినేత పవన్ సైతం వారికి గ్రేసు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం మాత్రం ఎక్కడా పొరపాటు జరగలేదని చెబుతోంది. పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులే పేపర్లు దిద్దారని చెప్పుకొస్తోంది. ఇక, ఇప్పుడు మున్సిపల్ పాఠశాలల విలీనం వ్యవహారం పైన విమర్శలు మొదలయ్యాయి. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేయనుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications