టీడీపీ నేతల హత్యల వెనుక ఎమ్మెల్యే కాటసాని హస్తం .. తప్పక తగిన మూల్యం, ఖబడ్దార్ : చంద్రబాబు
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో సినీ ఫక్కీలో వేటకొడవళ్లతో దాడి చేసిన టిడిపి నేతల దారుణ హత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. పట్టపగలే తెలుగుదేశం కార్యకర్తలను హతమారుస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణిస్తున్నాయి అని చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని ఉన్నారని ఆరోపించారు.

ఫ్యాక్షనిజం పోకడలతో ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు?
రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పని చేస్తుందో లేదో అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడవలసిన పోలీసులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇటువంటి ఫ్యాక్షనిజం పోకడలతో ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఏపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 30 మంది టిడిపి కార్యకర్తలను హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు.

రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండకు వైసిపి ప్రభుత్వానిది, పోలీసులది బాధ్యత
ఈ హత్యల వెనుక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండకు వైసిపి ప్రభుత్వానిది, పోలీసులది బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలో మరెక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ దారుణాలు అన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టిడిపి కార్యకర్తలు, నేతలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని పేర్కొన్నారు.
Recommended Video

టీడీపీ బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది
బాధిత కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ఇద్దరు టిడిపి నేతల మృతితో పెసరవాయి గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లా టిడిపి నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గ్రామంలో పోలీసులు ప్రతీకార దాడులు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications