ఏసీబీ కోర్టులో వాడీవేడీ వాదనలు-అరెస్ట్ అక్రమం అన్న చంద్రబాబు-ఆయనే కుట్రదారన్న సీఐడీ..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును నిన్న ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు సాయంత్రానికి విజయవాడ తెచ్చారు. అయితే కోర్టులో మాత్రం హాజరుపర్చలేదు. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ సుదీర్ఘంగా ఆయన్ను విచారించిన సీఐడీ.. ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి ఇవాళ ఉదయం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చింది. ఆ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.
విజయవాడ రాజ్ భవన్ రోడ్డులో ఉన్న కోర్టుల సముదాయంలో ఉన్న ఏసీబీ కోర్టులో చంద్రబాబును సీఐడీ హాజరుపర్చింది. దీంతో న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా చంద్రబాబు తరఫు వాదనలు విన్నారు. చంద్రబాబు తరఫు ముగ్గురు న్యాయవాదుల్ని వాదించేందుకు అనుమతి కోరగా.. జడ్జి మాత్రం ఇద్దరు న్యాయవాదులు సిద్ధార్ద్ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లుకు మాత్రమే అనుమతిచ్చారు.

అనంతరం వాదనలు ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా.. చంద్రబాబుపై సెక్షన్ 409 కేసు నమోదు చేయడం సరికాదని వాదించారు. సరైన సాక్ష్యాలు లేకుండా సెక్షన్ 409 కింద అరెస్టు చేయడం కుదరదన్నారు. అలాగే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చలేదన్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ స్కాంకూ ఇందులో సీఐడీ పెట్టిన సెక్షన్లకూ సంబంధమే లేదన్నారు. అనంతరం చంద్రబాబు తన వాదన వినిపించేందుకు అనుమతి కోరారు.
దీంతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమబిందు చంద్రబాబుకు అనుమతి ఇచ్చారు. తన అరెస్టు అక్రమం అని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చంద్రబాబు వాదించారు. తన అరెస్టు సందర్భంగా సీఐడీ వ్యవహరించిన తీరుపైనా ఆయన న్యాయమూర్తికి వివరాలు అందించారు. ఈ కేసులో తన పాత్ర లేకపోయినా సీఐడీ రాజకీయ కక్ష్యతోనే తనను అరెస్టు చేసిందని చంద్రబాబు జడ్జికి తెలిపారు. అనంతరం సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ప్రారంభించారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు అసలు కారకుడు చంద్రబాబేనని అదనపు ఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితుల్ని సీఐడీ అరెస్టు చేసిందని, ఈ 8 మందిపై ఉన్న అభియోగాలే చంద్రబాబుపైనా ఉన్నాయన్నారు. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చంద్రబాబు ఏ37గా ఉన్నప్పటికీ తాజాగా అరెస్టు చేసిన ఏ35 భాస్కర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నిందితుల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ కేసులో చంద్రబాబు ప్రజాధనానికి నష్టం కలిగిస్తూ తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఆయన్ను రిమాండ్ కు ఇవ్వాలని కోరారు. దీనిపై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు ప్రకటించనుంది.












Click it and Unblock the Notifications