నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది చెరుకూరి రామయ్య అలియాస్..: స్పష్టం చేసిన సాయిరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

ఈ అరెస్ట్ వ్యవహారంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు 2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రి పని చేసినప్పుడు లెక్కలేనన్ని నేరాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్ అనేది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సైతం చోటు చేసుకుందని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు భారీ మోసానికి పాల్పడ్డారనేది సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సొమ్మును నకిలీ కంపెనీల్లోకి మళ్లించినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా నిర్ధారించారని గుర్తు చేశారు.
సీమెన్స్ లిమిటెడ్‌తో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకునే ముసుగులో ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడని ధ్వజమెత్తారు. సంక్షేమం, అభివృద్ధి కోసం కేటాయించిన ప్రజాధనాన్ని స్వాహా చేయడం క్షమించరాని నేరమని సాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబు చేసిన నేరాలన్నింటినీ నిరూపించడానికి సీఐడీ, ఏసీబీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కాస్త ఆలస్యం అయితే అయ్యుండొచ్చు గానీ అరెస్ట్ శిక్ష మాత్రం తప్పదని సాయిరెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్ట్ అనేది ఆరంభం మాత్రమేనని, మున్ముందు మరిన్ని అరెస్టులు ఉండొచ్చని పరోక్షంగా సంకేతాలను ఇచ్చారు. జీవితాంతం జైలులోనే ఉండటానికి అవసరమైనన్ని కుంభకోణాలను చంద్రబాబు అండ్ కో చేశారని విమర్శించారు.
ఇక చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీ రావుకు కూడా చట్టం వర్తిస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ఇన్నాళ్లు తప్పించుకోగలిగారు కానీ ఇక శిక్షా సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వాడు శిక్షను అనుభవించక తప్పదని, దీనికి అవసరమైనన్ని సాక్ష్యాధారాలు పోలీసుల వద్ద ఉన్నాయనీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications