ఆ నలుగురూ రావాల్సిందే: విచారణ సమయంలో పట్టుబట్టిన చంద్రబాబు
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.. తగిన సాక్ష్యాధారాలతో సహా.
ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

మరోవంక- చంద్రబాబును సీఐడీ అధికారులు, పోలీసులు రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. ఆయనను మంగళగిరిలోని ఏపీ సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. అక్కడే స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తోన్నారు. విచారణకు చంద్రబాబుకు సహకరించట్లేదనే అభిప్రాయాలు ఉన్నాయి.
విచారణ సమయంలో నలుగురు సీనియర్ అడ్వొకేట్లు అక్కడే ఉండాలని చంద్రబాబు పట్టుబట్టారు. అడ్వొకేట్ల సమక్షంలోనే తనను విచారించాలనీ డిమాండ్ చేశారు. అప్పుడే తాను విచారణకు సహకరిస్తాననీ స్పష్టం చేశారు. తన స్టేట్‌మెంట్‌ను ఆ నలుగురు న్యాయవాదుల సమక్షంలోనే రికార్డు చేయాలని లిఖితపూరకంగా దరఖాస్తు చేసుకున్నారు చంద్రబాబు.
ఆ నలుగురూ రావాల్సిందే: విచారణ సమయంలో పట్టుబట్టిన చంద్రబాబు..!
— oneindiatelugu (@oneindiatelugu) September 9, 2023
#ChandrababuNaidu #ChandrababuArrest #CorruptionKingCBN #SkillDevelopmentScam #ITDepartment #WeWillStandWithCBNSir #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/7uDQjqxJpK
సీనియర్ లీగల్ కన్సల్టెంట్, మాజీ ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ కన్సల్టెంట్ పోసాని వెంకటేశ్వర్లు, అడ్వొకేట్ ఎం లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్ర సమక్షంలో మాత్రమే తనను విచారించాలని, స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీన్ని సీఐడీ అధికారులు తోసిపుచ్చారు.
అటు- చంద్రబాబును సీఐడీ ప్రధాన కార్యాలయానికి తరలించారనే విషయం తెలుసుకున్న వెంటనే ఆయన భార్య నారా భువనేశ్వరి, కుమారుడు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రబాబును కలవడానికి అనుమతి ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగారు.












Click it and Unblock the Notifications