చంద్రబాబు పచ్చజెండా: హిందూపురం నుంచే బాలయ్య
హైదరాబాద్: నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ పోటీ చేసే సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆయన శాసనసభకే పోటీ చేయనున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు సమాచారం.
బాలకృష్ణ ఈ నెల 16 లేదా 17 వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఇంతటితో బాలయ్య పోటీపై ఇప్పటివరకూ నెలకొన్న సందేహాలు దీంతో తొలగిపోయినట్లేనని భావిస్తున్నారు. హిందూపురం నుంచే పోటీ చేస్తానంటూ బాలకృష్ణ పట్టు బట్టడంతో చంద్రబాబు అంగీకరించక తప్పలేదని అంటున్నారు

హిందూపురం మొదటినుంచీ తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటవంటిది. పైగా, తన తండ్రి ఎన్టీ రామరావును ఆ సీటు ఆదరిస్తూ వస్తోంది. తండ్రిపై సెంటిమెంటు కారణంగా కూడా బాలకృష్ణ ఆ సీటుపై పట్టుబట్టినట్లు చెబుతున్నారు. కృష్ణా జిల్లా ఎక్కడినుంచైనా పోటీ చేయవచ్చునని కొన్నాళ్లుగా బాలయ్య అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. పెనమలూరు లేదా శ్రీకాకుళం నుంచి బాలకృష్ణ పోటీ చేయవచ్చునని పార్టీ వర్గాలు కొన్నాళ్లుగా పేర్కొంటున్నాయి.
తమ నాయకుడు చంద్రబాబు ఎలా చెబితే అలా నడుచుకుంటానని బాలయ్య ఇటీవల చెబుతూ వచ్చారు. చివరికి బాలయ్య పోటీకి హిందూపురం సరైన నియోజకవర్గం అని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేసినప్పుడే బాలకృష్ణ కూడా హిందూపురంలో నామినేషన్ దాఖలు చేయవచ్చునని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications