ఇబ్బందులున్నా చేస్తున్నా: బాబు, స్వీట్లు పంచారు
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో తాను రుణమాఫీ హామీ ఇచ్చానని, రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, అయినప్పటికీ రైతులు సంతోషంగా ఉండాలని రుణమాఫీకి నిర్ణయం తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శాసన సభలో అన్నారు. కరువు, విపత్తులతో రాష్ట్రం అతలాకుతలమైందన్నారు. పాదయాత్రతో రైతుల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. శాసన సభలో రుణ ఉపశమనంపై ప్రకటన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. రెండో విడత రుణమాఫీపై కేబినెట్ భేటీలో చర్చించామన్నారు. రుణమాఫీపై ఫిర్యాదుల కోసం కమిటీ వేశామని చెప్పారు. రూ.50వేల వరకు రుణాలు తీసుకున్న వారికి పూర్తిగా రుణం మాఫీ చేశామని, రూ.50వేలు పైబడిన వారికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టామన్నారు. రైతు సాధికార సంస్థ ఏర్పాటు చేశామని, ఈ సంస్థకు రూ.5వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.
పంటల బీమా కింద రూ.600 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఒకే సీజన్‌లో కౌలు రైతు, యజమాని రుణాలు తీసుకుని ఉంటే కౌలు రైతుకే ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. రైతులు రుణాలు రీషెడ్యూల్ చేసుకుంటే 4శాతం వడ్డీ వస్తుందని, వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి రైతులకు అదనంగా 6శాతం వడ్డీ లభిస్తుందన్నారు. వ్యవసాయ ఆధునీకరణకు చర్యలు తీసుకున్నామని, వ్యవసాయ ఆధార పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ఇసుక నుంచి వచ్చే ఆదాయంలో 75శాతం రైతులకే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతులను ఆదుకునేందుకు రుణ ఉపశమనం అన్నారు. వ్యవసాయం పట్ల యువత మొగ్గుచూపేలా చేస్తామన్నారు. ఇక్రిశాట్‌తో కలిసి పని చేస్తామన్నారు. రుణమాఫీ వద్దని ఆర్బీఐ చెప్పినప్పటికీ తాము చేశామన్నారు.
రుణమాఫీ కోసం కోటయ్య కమిటీ వేశామన్నారు. రైతుల ఆత్మహత్యలకు ముగింపు పలకాలని తాము రుణమాఫీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రైతు సాధికారిక సంస్థను ఏర్పాటు చేశామని, రైతులు సూచనలు ఇచ్చేలా కార్యక్రమం చేపట్టామన్నారు. వ్యవసాయం లాభసాటిగా చేసే వరకు నిద్రపోనని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పారు.
మనవడు.. చంద్రబాబుకు అభినందనలు, స్వీట్లు పంచిన సీఎం
మనవడు పుట్టిన ఆనందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో పార్టీ ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి రాగానే పార్టీ ఎమ్మెల్యేలు ఆయన వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తన ఛాంబర్‌లో ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు మిఠాయిలు పంచారు.












Click it and Unblock the Notifications