'డబ్బున్నోళ్లకే రాజ్యసభ టికెట్' : చంద్రబాబుపై బొత్స కామెంట్
హైదరాబాద్ : రాజ్యసభ అభ్యర్థులకు సంబంధించి ఏపీ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. తాజాగా టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక గురించి పలు కామెంట్స్ చేసిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మంగళవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. డబ్బునోళ్లకే చంద్రబాబు రాజ్యసభ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని తమ పార్టీ తరుపున రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పిన ఆయన, టీడీపీ మాత్రం ప్రజాస్వామ్య విలువలను గాలికి వదిలేసి డబ్బున్న నేతలనే రాజ్యసభకు నామినేట్ చేస్తోందని మండిపడ్డారు.
వైసీపీ తరుపున విజయసాయిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిత్వం గురించి ప్రస్తావిస్తూ.. విజయసాయి రెడ్డి ఉన్నత విద్యావంతుడని ప్రజలతో మమేకమవగల వ్యక్తి అని కితాబిచ్చారు. అలాగే రాష్ట్రం నుంచి సురేష్ ప్రభుని రాజ్యసభకు నామినేట్ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బొత్స.

ఇక పార్టీ ఫిరాయింపుల గురించి స్పందిస్తూ, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని చంద్రబాబుని విమర్శించారు. ధనార్జనే ముఖ్యంగా పాలన కొనసాగిస్తున్న చంద్రబాబు హామిలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలను మోసగిస్తున్నారన్నారు.
చంద్రబాబు మోసపూరిత పాలనకు నిరసనగా జూన్ 2వ తేదీన వైసీపీ నిర్వహించబోయే ఆందోళన కార్యక్రమాలు జూన్ 8వ తేదీకి వాయిదా పడ్డట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై అన్ని పోలీస్ స్టేషన్లలో ఆరోజు ఫిర్యాదులు చేస్తామని, ప్రతి నియోజకవర్గంలో సభలు ఏర్పాటు చేసి ప్రజల ముందు చంద్రబాబు పాలనను ఎండగడుతామన్నారు.












Click it and Unblock the Notifications