ఈ నెలలోనే బాబు క్యాబినెట్ విస్తరణ: లోకేష్ ఇన్, మంత్రుల్లో గుబులు
ఈ నెలలోనే చంద్రబాబు తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. నారా లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తన తనయుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. అదే సమయంలో కొంత మంది మంత్రులకు ఉద్వాసన తప్పక పోవచ్చుననే ప్రచారం సాగుతోంది. దాంతో మంత్రుల్లో గుబులు రేగుతోంది.
ఈ నెలాఖరున గానీ మార్చి మొదటివారంలోగానీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగుతాయి. ఈ సమావేశాలకు ముందే చంద్రబాబు తన మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారని అంటున్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాతనే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని మొదట భావించారు. కానీ బడ్జెట్ సమావేశాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇతర వ్యవహారాలు పూర్తయ్యేసరికి ఏప్రిల్ గడిచిపోతుంది. దీంతో కొంత ముందుగానే మంత్రివర్గాన్ని విస్తరించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

కొత్త మంత్రులు తమ పనితీరు నిరూపించుకోవడానికి కనీసం రెండేళ్ల సమయం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. చివరి రెండు మూడు నెలలూ ఎన్నికల హడావిడి ఉంటుంది. ఇప్పుడే మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే రెండేళ్ల సమయం కొత్తవారికి దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న మంత్రులకు రెండున్నరేళ్లకుపైగా సమయం లభించింది.
మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీ వరకే పరిమితం కాకుండా, ప్రస్తుతం ఉన్నవారి పనితీరును సమీక్షించి కొందరిని మార్చి, కొందరు కొత్తవారిని తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మొత్తం ఖాళీలను భర్తీ చేయకుండా రెండు ఖాళీలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారని అంటున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వచ్చినవారికి కూడా మంత్రిపదవులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నందు వల్ల అది సాధ్యమవుతుందా అనే సందేహం కలుగుతోంది.
సామాజిక సమీకరణాలను, ఆయా ప్రాంతాల్లో పార్టీ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. నలుగురు మంత్రులను తొలగించే అవకాశం ఉందని వారి స్థానంలో నలుగురి నుంచి ఆరుగురికి కొత్తగా చోటు దక్కవచ్చు. రాయలసీమలో ఒకర్ని తొలగించి ఒకరు లేదా ఇద్దరికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఒకరిని తొలగించి కొత్తగా మరొకరికి అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications