ఆపరేటర్లపై చంద్రబాబు భగ్గు: పవన్ కళ్యాణ్ కితాబు
విశాఖపట్నం: తుఫాను తాకిడి ప్రాంతాల్లోని టెలికాం ఆపరేటర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భగ్గుమన్నారు. గురువారం ఉదయం టెలికాం ఆపరేటర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు తుపాను సమయంలో టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్దరించకపోవడం టెలికాం ఆపరేటర్ల లోపమే అని మండిపడ్డారు.
ప్రజలు బాగున్నప్పుడు వారి దగ్గర రూ. కోట్లు ఆర్జించి, కష్టాల్లో ఉన్నప్పుడు మినిమం సర్వీసు అందివ్వలేరా అని అధికారులపై బాబు ధ్వజమెత్తారు. వ్యాపారం తప్ప మానవత్వం లేదా అని ప్రశ్నించారు. తక్షణం సర్వీసులను పునరుద్దరించేలా చర్యలు తీసుకోండని టెలికాం అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
సమీక్షా సమావేశానికి రాని టెలికాం ఆపరేటర్లను పోలీసులను పంపించి రప్పించాలని ఆయన ఆదేశించారు. మీ అంచనాలను తాము అందుకోలేకపోతున్నామని టెలికాం ఆపరేటర్లు చంద్రబాబుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసారు. సేవలను పునరుద్ధరిస్తామని టెలికాం ఆపరేటర్లు హామీ ఇచ్చారు.

కాగా, ఎయిర్‌టెల్ సిఇవో సునీల్ మిట్టల్ చంద్రబాబును కలిశారు. ఎల్లుండిలోగా ఎయిర్‌టెల్ సేవలను పునరుద్ధరిస్తామని ఆయన చంద్రబాబుతో చెప్పారు.
ఇదిలావుంటే, తుపాను సృష్టించిన బీభత్సానికి విశాఖ నగరం చాలా నష్టపోయిందని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఉదయం మీడియా సమావేశంలో చంద్రబాబుతో పాటు ఆయన పాల్గొన్నారు సంక్షోభ సమయంలో పాలనా అనుభవం ఉన్న వ్యక్తి అవసరం ఉందన్న ఆయన క్లిష్టపరిస్థితులను ఎదుర్కునే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని కొనియాడారు.
పాలనా అనుభవంతోనే చంద్రబాబు నష్టాన్ని నివారించగలిగారన్నారు. సమర్దమైన వ్యక్తి సీఎంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తక్షణ సాయం అందించిన ప్రధాని నరేంద్ర మోడీకి, ప్రజలకు అండగా ఉన్న బాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు పవన్ రూ. 50లక్షల చెక్కును అందజేశారు. విశాఖ పునర్నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రాజకీయాలకతీతంగా అందరూ కలిసి పని చేయాలని పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు.
పరిటాల సునీత పర్యటన
విశాఖపట్నం,అక్టోబర్ 16 : గుర్తింపు కార్డులు తీసుకువచ్చి రేషన్ దుకాణాలలో ఉచితంగా నిత్యావసర సరుకులు తీసుకుని వెళ్లాల్సిందిగా మంత్రి పరిటాల సునీత చెప్పారు. మత్స్యకారులకు బియ్యం 50కేజీ ఇస్తున్నట్లు తెలిపారు. గురువారం విశాఖలోని పలు ప్రాంతాల్లో మంత్రి సునీత పర్యటించారు.












Click it and Unblock the Notifications