జగన్ కార్నర్, రాజధాని: బాబు మెడకు 'శ్రీబాగ్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... కొత్త రాష్ట్రం అయినందున కేంద్రం నుండి పొందాల్సిన అంశాలపై చర్చించేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర ఏంపీలతో సమావేశమయ్యారు. అయితే, ఈ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు హాజరు కాలేదు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి కాంగ్రెసు పార్టీ ఎంపీలు జేడీ శీలం, టీ సుబ్బిరామి రెడ్డి తదితరులు హాజరు కావడం జగన్ పార్టీని చిక్కుల్లోకి నెట్టింది. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతు సహకారం అందిస్తామని కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు.

అయితే, ఈ భేటీకి హాజరు కాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీటుగానే స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మాట్లాడుతూ... అది చేస్తాం, ఇది చేస్తామని చంద్రబాబు మాటలు చెబుతున్నారే తప్ప ఇంత వరకు చేసిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. రాజధాని నిర్మాణం కూడా అతి కష్టం మీద జరుగుతుందన్నారు. రాజధాని ప్రకటన విషయంలో ప్రభుత్వం ఇస్తున్న బాధ్యతారాహిత్య ప్రకటనలు చేస్తోందన్నారు.
బాబుకు కర్నూలు చిక్కు
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలోనే నిర్మించాలని రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేస్తోంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం 'ఆంధ్రప్రదేశ్ రాజధాని - రాయలసీమ హక్కు' అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సదస్సులో జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ ఏల్ల తరబడి అన్ని రంగాలలో వెనుకబడి ఉందన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు, విశాఖలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం, శ్రీశైలం, తుంగభద్ర నుండి సాగు, తాగు నీటిని రాయలసీమ జిల్లా వాసులకు ఇవ్వాలన్నారు. రాజధాని వార్తల నేపథ్యంలో గుంటూరు - విజయవాడల మధ్య భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.
సీపీఎం నేత రాఘవులు మాట్లాడుతూ... సిఎం, ప్రతిపక్ష నేత రాయలీసమకు చెందిన వారే అయినప్పటికీ వారు రాయలసీమకు తగిన న్యాయం చేస్తారనే నమ్మకం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయలీసమ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, గత కొన్నాళ్లుగా రాయలసీమకు చెందిన పలువురు శ్రీబాగ్ ఒడంబికను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications