ఆ భయమే?, ఢిల్లీ వెళ్లింది వేడుకోవడానికే.. కానీ 'క్లైమాక్స్' వచ్చేసింది: బాబుపై జగన్
గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని వైసీపీ ఆరోపిస్తోంది. కేంద్రంతో తెగదెంపుల నేపథ్యంలో.. ఆయన చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోందని, దాన్ని నుంచి తప్పించుకునేందుకే ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 127వ రోజు మంగళవారం గుంటూరులో జరిగిన బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
Recommended Video


ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యం ఇదే:
'రాష్ట్రంలో నాలుగేళ్లుగా జరిగిన అవినీతిపై కేంద్రం విచారణ జరిపించే అవకాశం ఉంది గనుక.. అదే జరిగితే తన తరఫున పోరాడాలని ఇతర పార్టీల నేతలను వేడుకుంటున్నారు చంద్రబాబు. ఆయన ఢిల్లీ వెళ్లడంలో ఆంతర్యం అదే. కానీ చంద్రబాబు మోసాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ప్రజలు అంతా గమనిస్తున్నారు' అని బహిరంగ సభలో జగన్ వ్యాఖ్యానించారు.

క్లైమాక్స్‌కు చేరింది:
హోదా కోసం ఏదో చేస్తున్నట్టు ప్రజలను నమ్మించడానికే.. ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి బిల్డప్ ఇచ్చాడని జగన్ ఎద్దేవా చేశారు. అసలు హోదాపై ఆయనకు చిత్తశుద్ది ఉందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అవిశ్వాసం పెట్టకుండా ఉంటే.. చంద్రబాబు ఆ ధైర్యం చేసేవారా? అని నిలదీశారు.
'అవిశ్వాసంతో లాభం లేదని, ఆపై యూటర్న్ తీసుకున్నాడు. పైగా నేను రాసిన లేఖ పట్ల స్పందించి.. ఇతర పార్టీల నాయకులు మద్దతు తెలిపితే.. అది కూడా నావల్లే అంటూ చెప్పుకున్నాడు. ఇదంతా సిగ్గుమాలిన వ్యవహారం కాదా? చంద్రబాబు మోసం క్లైమాక్స్‌కు చేరింది' అని జగన్ మండిపడ్డారు.

రాజీనామాలు, ఆమరణదీక్ష వద్దా?:
'పార్లమెంట్ సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పాం. టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయిస్తే దేశవ్యాప్తంగా దీనిపై మరింత చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్రం దిగి రాదా?.. కానీ చంద్రబాబు ఎంపీలతో రాజీనామా చేయించడట. మా ఎంపీలంతా ఆమరణదీక్షకు కూడా సిద్దమంటే.. చంద్రబాబు మాత్రం వాళ్ల ఎంపీలతో దీక్ష చేయించడట.' అంటూ జగన్ సీఎం వైఖరిని తప్పు పట్టారు.

ఇలాంటి వ్యక్తి అర్హుడేనా?..:
'రాష్ట్రంలో అవినీతిపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. వాటిపై కేంద్రం ఎక్కడ విచారణ జరిపిస్తుందోనని బాబుకు భయం. అందుకే వ్యక్తిగత స్వార్థం కోసం ఆయన తరఫున పార్లమెంట్‌లో ఎంపీ లు పోరాటం చేయాలట.
అందుకే ఎంపీలతో రాజీనామాలు చేయించరట. మరోసారి హోదాను తాకట్టుపెట్టేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడానికి అర్హుడేనా? అన్నది జనం ఆలోచించాలి..' అని జగన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications