ప్రతిపక్షానికి నొప్పి ఎందుకు?: ఓర్వలేక ఏమైనా చేస్తారేమోనని చంద్రబాబు అనుమానం
అమరావతి: కృష్ణా పుష్కరాలపై మీడియా బాధ్యతారాహిత్యంగా వార్తలు రాయొద్దని, అలా రాస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పుష్కర ఏర్పాట్లపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 లక్షల మంది పుష్కర స్నానం చేశారని అన్నారు.
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేదుకు కొత్త టెక్నాలజీని వినియోగిస్తున్నామని తెలిపారు. కైలాజ్ యాప్ ద్వారా పుష్కర ఏర్పాట్లపై భక్తుల ఫీడ్ బ్యాక్‌ను తీసుకుంటున్నామని చెప్పారు. పుష్కరాలపై వివిధ మార్గాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నామని అన్నారు.
ముఖ్యంగా పుష్కరాల్లో లా అండ్ ఆర్డర్ కోసం టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పారు. కృష్ణా నీరు కలుషితం అయ్యే అవకాశం లేదని గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా ఎప్పటికప్పుడు తాజా నీటిని కృష్ణా నదిలోకి మళ్లిస్తున్నామని తెలిపారు. తప్పుడు వార్తలతో భక్తులను భయపెట్టొద్దని, పుష్కరాలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఎంతో కష్టపడుతున్నామని అన్నారు.

కృష్ణానది తీరంలోని అన్ని ఘాట్ల వద్ద మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వల్ల సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. పుష్కరాల్లో ఎక్కడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చేయడమే తమ ప్రయత్నమని చంద్రబాబు చెప్పారు.
కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరుగుతుంటే ఓర్వలేక ఏమైనా చేస్తారేమో అనే అనుమానం వస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాజధానికి భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉంటే ప్రతిపక్షానికి ఎందుకంత నొప్పి అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఉన్మాదం ప్రతపక్షానికి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా, నిధులు లేకున్నా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. రాజధానికి ఎన్నిసార్లు అడ్డుపడతారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications