కేసీఆర్ చేతిలో బాబు భవిష్యత్తు, జాతకమంతా ఉంది: జగన్
కాకినాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వద్ద ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెందిన పూర్తి అవినీతి జాతకం ఉందని, ఆ కారణంగానే కేసీఆర్‌కు బాబు ఎదురు వెళ్లడం లేదని వైసిపి అధినేత వైయస్ జగన్ మంగళవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధమున్న ఆడియో, వీడియో సాక్ష్యాలు కేసీఆర్ వద్ద ఉన్నాయని, అవి ఏ రోజు బయటకు వచ్చినా బాబు కటకటాల వెనక్కు వెళ్లాల్సి వస్తుందన్నారు. అందుకు భయపడే ఏపీ ప్రజలకు అన్యాయం జరిగేలా ప్రాజెక్టులు కడుతున్నా అడ్డుకోవాలన్న ఆలోచన లేకుండా ఉన్నారన్నారు.
కాకినాడలో పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కృష్ణా నీటిని కేసీఆర్ ఆపుతుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఓటుకు నోటు భయం చంద్రబాబులో ఉన్నంత కాలం, రాష్ట్ర ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే ఏపీలో అందరి జీవితాలు బాగుపడతాయన్నారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు మోసం చేశారన్నారు. ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా యువత జీవితాలు బాగుపడాలన్నా ప్రత్యేక హోదా అవసరమన్నారు.
ఎన్నికలకు ముందు ఓ మాట చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు పంగనామాలు పెట్టారన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి ఉద్యోగం వచ్చాక, హామీలు మర్చిపోయారన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు.. అలా అన్ని విషయాల్లోను మోసం చేశారన్నారు.












Click it and Unblock the Notifications