ఏపీలో గ్రామాలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. ఏపీలో అత్యాధునిక ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీని మారుమూల గ్రామాలకు చేరువ చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారత్ నెట్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా హాజరయ్యారు.
ఏపీ ప్రభుత్వానికి భారత్ నెట్ కు మధ్య ఒప్పందం
ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, భారత్ నెట్ కు మధ్య ఒప్పందం కుదిరింది. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పర్యవేక్షణలో ఎంవోయూపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలకు భారత్ నెట్ విస్తరించబడుతుంది. ఈ క్రమంలో ఏపీలో మారుమూల గ్రామాలకు కూడా భారత్ నెట్ నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఈ డిజిటల్ సేవల ప్రాజెక్టు రాష్ట్రంలోని మొత్తం 13,426 పంచాయతీలలో అమలు చేయబడుతుంది.

ఏపీకి 2432 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్రం అంగీకారం
దేశ వ్యాప్తంగా 5లక్షల గ్రామాలకు ఫైబర్ కనెక్షన్లు అందించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీనికోసం ఏపీకి 2432 కోట్ల రూపాయలను విడుదల చేయడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టును సజావుగా అమలు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఏపీ బి ఐ ఎల్ పేరుతో ఒక ప్రత్యేక వాహక సంస్థను ఏర్పాటు చేసింది.
నాటికి, ఇప్పటికీ సాంకేతికపై సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో కేవలం 2 mbbs బ్యాండ్ విడ్త్ తో కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ లను నిర్వహించామని గుర్తు చేశారు. అమెరికా పర్యటన తర్వాత ఇంటర్నెట్ విప్లవం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మారుస్తుందని తను గుర్తించినట్లుగా ఆయన పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో bsnl 4g టెక్నాలజీని తీసుకురావడం గొప్ప విజయమని చంద్రబాబు ప్రశంసించారు.
ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 970 సేవలు
ప్రస్తుత ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టిందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నాలజీ పరంగా ఇప్పటికే దూసుకుపోతున్నామని చెప్పిన చంద్రబాబు ఏపీ ప్రభుత్వం 970 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన రికార్డులను క్యూఆర్ కోడ్ ద్వారా భద్రపరుస్తున్నాము అని, సంజీవిని ప్రాజెక్టు ద్వారా ఆరోగ్య రంగంలో రియల్ టైం మానిటరింగ్ వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ రంగాలలో యువతకు అద్భుతమైన అవకాశాలు
డ్రోన్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, రోబోటిక్స్ వంటి రంగాలలో యువతకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏపీలో ప్రతి ఫ్యామిలీ ఏఐ ను వినియోగించుకునేలా ఉండాలన్నారు చంద్రబాబు.












Click it and Unblock the Notifications