ఆ నియోజకవర్గానికి వెళ్లబోతున్న చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈనెల 12వ తేదీ నుంచి కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. తన పర్యటనలో భాగంగా 13వ తేదీన గుడివాడకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ బహిరంగసభను నిర్వహించేలా తెలుగు తమ్ముళ్లు ప్రణాళిక రచించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలనే పట్టుదలతో వారున్నారు. తెలుగుదేశం పార్టీ గెలవడంకన్నా వారికి మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించడమే ప్రత్యేక లక్ష్యంగా మారింది.
స్పష్టత ఇవ్వని అధిష్టానం: తెలుగుదేశం పార్టీలోనే రాజకీయంగా ఎదిగి.. చివరకు తమ అధినేత చంద్రబాబును అసభ్య పదజాలంతో విమర్శిస్తుండటం, కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తుండటంతో టీడీపీ శ్రేణులు కొడాలి నానిని ఓడించడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న నానిని ఓడించడానికి తెలుగు తమ్ముళ్ల దగ్గర సరైన ప్రణాళిక లేదు. కొడాలికి ధీటైన అభ్యర్థి లేరు. ప్రస్తుతం అక్కడ రావి వెంకటేశ్వరరావు ఇన్ ఛార్జిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వెంకటేశ్వరరావుకు సీటిస్తారా? లేదంటే ఎవరైనా బరిలోకి దిగుతారా? అనే విషయంపై పార్టీ అధిష్టానం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.

తెలుగు తమ్ముళపై చంద్రబాబు ఫైర్: చంద్రబాబును టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కొడాలి నాని నియోజకవర్గంలో ఎందుకు బలంగా ఉన్నారు? ఆయన బలాలు ఏమిటి? బలహీనతలు ఏమిటి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే ఎటువంటి ప్రణాళిక రచించుకోవాలి?... తదితర విషయాలపై తెలుగు తమ్ముళ్లు శోధన కూడా చేయడంలేదు. గతంలోనే ఇక్కడ మినీ మహానాడు నిర్వహిద్దామనుకున్నప్పటికీ వర్షాలు కురియడంతో అది రద్దయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంవల్లే చిన్న కార్యక్రమాన్ని కూడా చేయలేకపోయామంటూ తమ్ముళ్లపై చంద్రబాబు విరుచుకుపడ్డారు.
కనీసం.. 6నెలల ముందన్నా: ఏడాదిన్నర, ఏడాది ముందుగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న చంద్రబాబు కీలకమైన గుడివాడ, గన్నవరం లాంటి నియోజకవర్గాల్లో ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. కనీసం 6నెలల ముందుగానైనా గుడివాడ నుంచి పోటీచేసేవారిని ప్రకటిస్తే పోరాడటానికి వీలవుతుందని, అలా కాకుండా చివరి నిముషంలో ప్రకటిస్తే ఈసారి కూడా కొడాలి నాని గెలుపును అడ్డుకోలేమని తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. గుడివాడ విషయంలో చంద్రబాబు ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తారో వేచి చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications