ఎపిలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తాం:సిఎం చంద్రబాబు
Recommended Video

అమరావతి: పర్యావరణ పరిరక్షణకు సహకరించే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
మంగళగిరిలో ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ, మహీంద్ర ఎలక్ట్రిక్, జూమ్ కార్ సంయుక్త భాగస్వామ్యంతో రూపొందించిన బ్యాటరీ కార్ల శ్రేణిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తదనుగుణమైన పలు విధానాలను ఇప్పటికే సిద్ధం చేశామని చెప్పారు.

పర్యాటక సౌకర్యాల కల్పనలో రాజీ పడొద్దని అధికారులకు సూచనలు చేశారు. పర్యాటకులకు ఉపయోగపడేలా మహీంద్రా జూమ్ కార్లు రూపొందించడం ముదావ హమన్నారు. ఇప్పటికే పూనే, కోల్‌కతా, ముంబై, న్యూఢిల్లీ, జైపూర్, హైదరాబాద్, మైసూర్‌లలో ఇవి నడుస్తున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలోనే అతిముఖ్యమైన కూడలి నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని సిఎం చంద్రబాబు చెప్పారు.
వినూత్న ఆవిష్కరణలతో ఎవరు ముందుకొచ్చినా ప్రోత్సహిస్తామని సిఎం చంద్రబాబు వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాల అమలులో సాధ్యమైన చోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశ పెట్టాలని చంద్రబాబు చెప్పారు.
అనంతరం పర్యాటకశాఖ నూతనంగా సమకూర్చుకున్న ఆధునిక ఓల్వో బస్సులను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు. విశాఖ నుంచి తిరుపతి మధ్య ఈ బస్సులను నడపనున్నామని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ ఎవరికి వారు నడిపేలా ఏర్పాటు చేసిన ఈ బ్యాటరీ అద్దె కార్లు గన్నవరం విమానాశ్రయం, బెంజ్ సర్కిల్, సచివాలయం వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పారు. మహీంద్ర ఎలక్ట్రిక్ సీఈవో మహేశ్‌బాబు, జూమ్ కార్ సంయుక్త వ్యవస్థాపకుడు, సీఈవో గ్రేస్ మోరాన్, పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వాహణా సంచాలకుడు హిమాన్హుశుక్లా, అధ్యక్షులు ఆచార్య జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications