బాబు టిడిపి: తెలంగాణలో నష్టం, సీమాంధ్రలో లాభం

Chandrababu losing in Telangana, gaining Seemandhra
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో నష్టపోతూ, సీమాంధ్రలో లాభపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోని పలువురు తెలుగుదేశం నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వైపు చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి శుక్రవారంనాడు తెరాసలో చేరారు. నగేష్ వంటి మరికొంత మంది శాసనసభ్యులు కూడా తెరాసలోకి రావడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి.

రంగారెడ్డి జిల్లాకు చెందిన హరీశ్వర్ రెడ్డి ఇదివరకే తెరాసలో చేరారు. గంగుల కమలాకర్ వంటివారు కూాడ తెరాసలోకి వెళ్లారు. తెలుగుదేశంలో కీలకమైన నేతగా ఎదిగిన నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలోకి వెళ్లారు. తెరాస కాంగ్రెసులో విలీనమవుతుందా, లేదా అనే విషయం తేలిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండవచ్చునని భావిస్తున్నారు.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా చంద్రబాబునాయుడినే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి శాసనసభ్యులు తన పార్టీలో చేరిన సందర్భంలో కెసిఆర్ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపిని ఖాళీ చేయాలని ఆ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు ఎదురుదాడికి సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కెసిఆర్‌ను దుయ్యబట్టారు. రాజకీయాల్లో తన వద్దనే కెసిఆర్ శిక్షణ పొందాడని, గురువుకే పంగనామాలు పెడుతున్నాడని ఆయన అన్నారు.

అయితే, సీమాంధ్రలో మాత్రం చంద్రబాబు నాయుడు పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ నాయకులు, శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన గంటా శ్రీనివాస రావుతో పాటు నలుగురు శాసనసభ్యులు విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ నెల 12వ తేదీన వారు పార్టీలో చేరే అవకాశాలున్నాయి.

రాయలసీమ ప్రాంతంలో కూడా చంద్రబాబుకు అనూహ్యమైన సానుకూల స్పందన లభిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లలేని కాంగ్రెసు నేతలు చంద్రబాబు వైపు చూస్తున్నారు. మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వారి రాకతో కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అదనపు బలం చేకూరుతుంది.

కాగా, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గానికి చెందిన జెసి దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. వారిని చేర్చుకోవడానికి శాసనసభ్యురాలు పరిటాల సునీత తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. అయితే, పరిటాల సునీతను ఒప్పించి వారికి చంద్రబాబు పార్టీలో చోటు కల్పించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

జెసి దివాకర్ రెడ్డి సోదరుల రాకతో అనంతపురం జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుతుంది. ఇప్పటికే ఆ జిల్లాలో బలమైన నాయకులు ఉన్నారు. పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తదితర నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. మొత్తం మీద, చంద్రబాబు సీమాంధ్రలో పుంజుకుని, తెలంగాణలో బలహీన పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+