చంద్రబాబుకు ఎసరు: అమిత్ షా అస్త్రం పురుంధేశ్వరి?

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: చాప కింద నీరులా విస్తరిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి కాళ్ల కిందికి నీళ్లు తేవడానికి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు అవరమైన బలాన్ని సమకూర్చుకునేందుకు ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి నడవకూడదనే అభిప్రాయంతోనే ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. సొంత బలం కోసం ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో చంద్రబాబుకు పోటీగా ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిని ముందుకు తేనున్నట్లు సమాచారం.

ఎలక్షన్ మేనేజ్‌మెంట్ తెలిసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టార్గెట్‌గా చేసుకున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో ఆయన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మేలో అమిత్ షా పర్యటన, జూలైలో విశాఖలో జాతీయ మహాసభల నిర్వహణ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భువనేశ్వర్‌లో జరిగిన పార్టీ జాతీయ మహా సభల తరువాత ఏపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ శని, ఆదివారాల్లో విశాఖలో జరుగుతాయి. ఈ సమావేశంలో కేవలం పార్టీ బలోపేతం గురించి మాత్రమే చర్చిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు.

ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్

ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్

కాంగ్రెసు పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డిలా, ప్రస్తుతం చంద్రబాబులా బిజెపి 2019 ఎన్నికలకు ముందే, ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టాలనే ఆలోచనలో అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో ఇందుకు రంగం సిద్ధం అయినట్టు చెబుతున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నా కూడా, వచ్చే ఎన్నికల నాటికి 15 పార్లమెంటు స్థానాల్లో కీలకశక్తిగా ఎదిగే ప్రణాళికకు ఆ పార్టీ నాయకత్వం పదునుపెడుతోంది. ఆ మేరకు గత రెండేళ్లుగా విజయం సాధించిన, వివిధ రాష్ట్రాల్లో అనుసరించిన పోలింగ్ బూత్ వ్యవస్థను ఇక్కడా అమలు చేయాలని అమిత్ షా భావిస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పదును...

రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పదును...

రాష్ట్రంలో తెలుగుదేశం-బిజెపి మధ్య నెలకొన్న సయోధ్యకు రాష్టప్రతి ఎన్నికల తర్వాత తెరపడే అవకాశాలున్నాయి. ప్రతిష్ఠాత్మకమైన రాష్టప్రతి ఎన్నికలో తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకునే అవసరం బిజెపికి ఉంది. దాంతో వివిధ రాష్ట్రాల్లోని మిత్రపక్షాలతో సఖ్యతను కొనసాగిస్తున్న బిజెపి నాయకత్వం, ఆ తర్వాత ఆయా రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగే వ్యూహానికి పదునుపెడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత చంద్రబాబుకు క్రమంగా దూరం జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటుందని భావిస్తున్నారు.

బిజెపి నేత సోము వీర్రాజు ఇలా..

బిజెపి నేత సోము వీర్రాజు ఇలా..

చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై బిజెపి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తోంంది. కేంద్రం ఇచ్చిన హామీల గురించి పదే పదే ప్రస్తావిస్తూ, తెలుగుదేశం పార్టీ తమను ప్రజల్లో అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నాలు చేస్తోందని బిజెపి నాయకులు భావిస్తున్నారు. అదే శైలిలో ఎదురుదాడికి దిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. మద్యం అమ్మకాలు, ఇసుక మాఫియా వల్ల రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న నష్టం, ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై ఆ పార్టీ ఎమ్మెల్సీ, జాతీయ కార్యవర్గసభ్యుడైన సోము వీర్రాజు ఇటీవల తరుచుగా విమర్శలు చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. ప్రజా సమస్యలపై ఆయన తరచూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగలేఖ రాస్తున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై బిజెవైఎం అధ్యక్షుడు ఇలా..

చంద్రబాబు ప్రభుత్వంపై బిజెవైఎం అధ్యక్షుడు ఇలా..

రెండురోజుల క్రితం బిజెపి యువజన విభాగం బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసి, వాటిని అమలుచేయాలని డిమాండ్ చేసి, కేంద్రంపై తెలుగుదేశం చేస్తున్న ఒత్తిళ్లకు సమాధానంగా తామూ అదే పంథా కొనసాగిస్తామనే సంకేతాలు పంపారని అంటున్నారు. బిజెపి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి జి రవీంద్రరాజు, బిజెవైఎం ఏపి ఇన్చార్జి ఎస్‌వి రాఘవేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆడారి కిశోర్‌కుమార్ తదితరులు హాజరైన పదాదికారుల సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ వాటిని అమలు చేయాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.

దగ్గుబాటి పురంధేశ్వరి ఇలా..

దగ్గుబాటి పురంధేశ్వరి ఇలా..

రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న ఇసుక మాఫియాను దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తావించి చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు తనకు తెలియవని చంద్రబాబు చెప్పడం సరికాదని, ఇసుక మాఫియాలో ప్రజాప్రతినిధులుండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓవైపు ఉచిత ఇసుక అంటూ మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి వ్యూహంలో భాగంగానే ఆమె చంద్రబాబుపై వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.

బిజెపి అస్త్రం పురంధేశ్వరి...

బిజెపి అస్త్రం పురంధేశ్వరి...

వచ్చే ఎన్నికల నాటికి ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిని చంద్రబాబుకు పోటీగా తయారు చేయాలనే సంకల్పంతో అమిత్ షా ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెను ముందుకు తేవడం ద్వారా ఎన్టీ రామారావు వారసత్వంపై చర్చను లేవదీసి చంద్రబాబును చిక్కుల్లో పడేయవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు బాలకృష్ణను చేరదీయడం ద్వారా నందమూరి వారసత్వాన్ని దెబ్బ తీశారనే అభిప్రాయం ఉంది. దగ్గుబాటి పురంధేశ్వరిని ముందు పెడితే తెలుగుదేశం పార్టీలో చిచ్చు రగిలే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు తాజాగా...

దగ్గుబాటి వెంకటేశ్వర రావు తాజాగా...

పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ టీవీ కార్యక్రమంలో చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓటుకు నోటు కేసును కూడా ప్రస్తావించి చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇది కూడా బిజెపి వ్యూహంలో భాగంగానే జరిగిందని అంటున్నారు. దగ్గుబాటి పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తెస్తే పార్టీ నాయకులు కూడా అంగీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అలా అయితే జూ.ఎన్టీఆర్ వస్తారా...

అలా అయితే జూ.ఎన్టీఆర్ వస్తారా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గుబాటి పురంధేశ్వరిని ముందు పెట్టి బిజెపి ఎన్నికలకు వెళ్లే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సహకరించవచ్చుననే అంచనా ఉంది. తన కుమారుడు నారా లోకేష్‌ను తన వారసుడిగా ముందుకు తెస్తూ నందమూరి వారసత్వాన్ని లేకుండా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేశారనే విమర్శ ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టిడిపి కోసం పనిచేసే అవకాశాలు లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పురంధేశ్వరికి బాసటగా నిలిచినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

అవరమైతే జగన్‌తో వెళ్లాలని...

అవరమైతే జగన్‌తో వెళ్లాలని...

అవసరమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్‌తో వెళ్లాలనే రెండో ప్రణాళిక కూడా బిజెపికి ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ఓసారి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ పురంధేశ్వరితో చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా పురంధేశ్వరిని కలిశారు. దాంతో పురంధేశ్వరి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, ఆ ప్రచారాన్ని పురంధేశ్వరి కొట్టిపారేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటాను గానీ బిజెపి నుంచి తప్పుకోనని ఆమె చెప్పారు. అయితే, ఆ భేటీలు అవసరమైతే జగన్‌తో వెళ్లాలనే బిజెపి ఆలోచనలో భాగంగా జరిగాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that BJP prsident Amit Shah is planning to part away from andhra Pradesh CM and Telugu Desam party chief Nara Chandrababu Naidu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి