పవన్ కళ్యాణ్ రాజకీయాలు: చంద్రబాబు ట్రంప్ కార్డు?
హైదరాబాద్: రాజకీయాల్లోకి ప్రవేశించి పోటీ చేయాలనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని, రాజకీయాలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ట్రంప్ కార్డుగా ఉపయోగపడవచ్చునని అంటున్నారు. కాంగ్రెసుపై తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించే పవన్ కళ్యాణ్ బిజెపికి, టిడిపికి అనుకూలంగానే రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు చెబుతున్నారు.
పార్టీ పెట్టి పోటీ చేసే సమయం లేకపోవడంతో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మీద ఎన్నికల బరిలోకి దిగవచ్చునని అంటున్నారు. అన్ని స్థానాలకు కూడా పోటీ చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదని అంటున్నారు. ప్రశ్నించడానికి ఓ పార్టీ అనే నినాదంతో ఆయన ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ మల్కాజిగిరి లేదా అనకాపల్లి స్థానాల నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. శాసనసభకు 25 మంది అభ్యర్థులను పోటీకి దించుతారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ధ్రువీకరించారు. అశ్వినీ దత్ తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి వస్తాయని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని ధ్రువీకరిస్తూ బిజెపికి, టిడిపికి అనుకూలంగా అశ్వినీ దత్ ప్రకటన చేయడాన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పైగా, లోకసభ సీటులో పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తామని, పవన్ కళ్యాణ్ శాసనసభకు అభ్యర్థులను పెడితే 25 స్థానాల్లో తాము బలపరుస్తామని తెలుగుదేశం పార్టీ మధ్యవర్తులు పవన్ కళ్యాణ్‌తో చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
తాజా పరిణామాలను చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కాంగ్రెసుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ వల్ల సీమాంధ్రలో కాపు సామాజిక వర్గం ఓట్లు చీలితే అది తెలుగుదేశం పార్టీకే ఉపయోగపడుతుందనే అంచనాలున్నాయి.












Click it and Unblock the Notifications