గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోట: ప్యాకేజీపై స్వరం పెంచిన బాబు
అమరావతి: రాజమహేంద్రవరంలోని మధురపూడి విమానాశ్రయ విస్తరణ పనులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజలో కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, ఆశోక్ గజపతి రాజు తదితరులు పాల్గొన్నారు. రూ. 181 కోట్లతో ఎయిర్ పోర్ట్ రన్ వే విస్తరణ పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రూ. 52వేల కోట్ల పెట్టుబడులు రాబోబుతున్నాయన్నారు. ఈ ప్రాంతమంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ. 300 కోట్లతో విమానాశ్రయానికి సరిపడ భూములిచ్చామన్నారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయలకు భూములిచ్చామన్నారు. కాకినాడలో మరో ఓడరేవు నిర్మిస్తున్నామని చెప్పారు.

కాకినాడ నుంచి చెన్నై వరకు బకింహ్ హామ్ కెనాల్ ద్వారా జల రవాణాని త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో రాజమండ్రి ఎయిర్ పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తామన్నారు. రాష్ట్రానికి మరో ఆరో, ఏడో ఎయిర్‌పోర్టులు వస్తాయని, ఇంకా ఐదారు పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడలో ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ తీసుకొస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలకు టీడీపీ అండగా నిలుస్తుందన్నారు. కాపులకు రిజర్వేషన్‌పై కట్టుబడి ఉన్నానన్నారు. కాపులకు న్యాయం చేసేందుకే మంజునాథ కమిటీని వేశామన్నారు. కాపులను ఆదుకునే బాధ్యత టీడీపీదేనన్నారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రైతులకు రుణవిముక్తి 24వేల కోట్లు ఇచ్చానని తెలిపారు. గోదావరి జిల్లాలు టీడీపీకి కంచుకోట అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానన్నారు.
డ్వాక్రా మహిళలకు ఈసారి ఉచితంగానే రుణాలను మంజూరు చేస్తానన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, ఏపీ అభివృద్ధే ముఖ్యమన్నారు. కేంద్రంతో పొత్తు పెట్టుకోవడానికి కారణం రాష్ట్ర ప్రయోజనాలేనని చెప్పుకొచ్చారు. లోక్ సభలో ఇచ్చిన హామీలపై గట్టిగా పట్టుబడటంతోనే కేంద్రం ప్యాకేజీ ఇచ్చిందన్నారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తే ఎందుకు తీసుకోకూడదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నప్పుడే జీఎస్టీ బిల్లు వచ్చినప్పుడు ఏపీకి హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు.
ఇక వైసీపీ విషయానికి వస్తే లాలూచీ పడి అసెంబ్లీలో దారుణంగా ప్రవర్తించారన్నారు. ఒక ఉన్మాదంలాగా రాష్ట్ర ప్రయోజనాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుకు కూడా అడ్డుపడుతున్నారన్నారు. ఏదైనా మంచి మాటలు చెబుతారేమో విందామని అనుకున్నామని, వైసీపీ ప్రతిపక్షంగా ఉండడం ఏపీ దౌర్భగ్యమని, ఉన్మాదతనంలో ముందుకు పోతున్నారని, ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పరిస్థితిలేదన్నారు. ఉభయగోదావరి జిల్లాలను అపారమైన ప్రకృతి సంపదకు నిలయంగా చంద్రబాబు అభివర్ణించారు.
కేరళలో కంటే బ్రహ్మాండమైన పర్యాటక ప్రాంతాలు కోనసీమలోనే ఉన్నాయన్నారు. ఈ సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను 2020 నాటికి దేశంలోనే మూడు అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్నదే తన లక్ష్యమన్నారు.
Performing bhoomi pooja for expansion of RajahmundryAirport runway with Rs181cr @ncbn @Ashok_Gajapathi @yschowdary pic.twitter.com/fWWrR8Mzyz
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 19, 2016












Click it and Unblock the Notifications