టీ న్యూస్‌కు ఇప్పుడెందుకు నోటీసులిచ్చారు: బాబు, రొటీన్: అధికారులు
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సద్దుమణుగుతున్న దశలో టీ న్యూస్, సాక్షి ఛానెల్‌లకు నోటీసులు ఎందుకు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆరా తీసినట్లు తెలుస్తోంది.
గత రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో నెలకొన్న వివాదం కాస్త చల్లబడ్డట్లు కనిపించింది. టీ న్యూస్ ఛానెల్‌కు నోటీసులు జారీ చేయడంతో తెరాసలో మళ్లీ కలకలం చెలరేగింది. హైదరాబాదులో జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. ఏపీ సచివాలయం, ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట టీ న్యూస్ జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు.

దీంతో వివాదం సద్దుమణుగుతున్న దశలో నోటీసులు ఎందుకు ఇచ్చారని పోలీసులను చంద్రబాబు ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దానికి, కేసు నమోదు చేసిన తర్వాత కొన్ని పద్ధతులను అనుసరించవలసి ఉంటుందని, అందులో భాగంగానే టీ న్యూస్, సాక్షి, టెలికాం ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
దీని వల్ల జరిగే నష్టం ఏదీ లేదని, కేసు నమోదు చేసిన తర్వాత విచారణ లేకుండా పక్కన పెట్టలేమని వారు చంద్రబాబుకు చెప్పారని తెలుస్తోంది. ఉభయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తలు వద్దని కేంద్రం కోరుకుంటోందని, దానిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని చంద్రబాబు సూచించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications