ఎపి సిఎం పదవే, బయటపెడ్తా: బాబు ఆసక్తికర వ్యాఖ్య

సోమవారం సాయంత్రం ఆయన చిత్తూరు జిల్లాలో మాట్లాడారు. ఈ సందర్భంగా మళ్లీ ఎపికే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటానని చెప్పడం గమనార్హం. రెండుసార్లు జాతీయ స్థాయిలో తనకు అవకాశం వచ్చినా రాష్ట్రమే ముఖ్యమని ఉండిపోయిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు.
రాష్ట్రంలో టిడిపి ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే విభజన కుట్రను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించడమే కాక, రాజకీయాలపై నిస్తేజాన్ని వీడి అవినీతి కాంగ్రెస్, తెరాసలను భూస్థాపితం చేస్తేనే భవిష్యత్తు ఉంటుందని యువతకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర విభజన కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారంటూ కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను తూర్పారబట్టారు. అందరికీ ఆమోదయోగ్య పరిష్కారం చూపిన తర్వాతే విభజన గురించి ఆలోచించాలని, ఏకపక్షంగా ముందుకుపోతే టిడిపి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని హెచ్చరించారు. తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటిన ఎన్టీఆర్ స్ఫూర్తితో ఏ ఒక్క తెలుగువాడి గౌరవానికీ భంగం కలగకుండా చూడడానికి టిడిపి కంకణం కట్టుకుందన్నారు.
ఈ నెల 21న తిరుమలేశుని దర్శనం చేసుకుని, అదే రోజు తిరుపతిలో జరిగే సభలో కాంగ్రెస్, జగన్ పార్టీ, తెరాసల కుతంత్రాలను బయటపెడతానన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో ధర్మ పోరాటం సాగిస్తున్న టిడిపి ఘన విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications