బాబు 'జపాన్' టార్గెట్: భాషా కష్టాలకి చెక్, ఒబామాకోసం
హైదరాబాద్: పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బృందం జపాన్ పర్యటనకు వెళ్తోంది. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)ని వేగంగా అభివృద్ధి చేసి మరో ఐటీ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చాలని బాబు భావిస్తున్నారు. అలాగే, రాజధాని లేని ఏపీని దేశంలోనే అగ్ర రాష్ట్రంగా చూడాలని భావిస్తున్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న అన్నింటిని ఆయన ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. ఇటీవలె సింగపూర్ వెళ్లొచ్చారు. ఇప్పుడు జపాన్ వెళ్తున్నారు. కొద్ది రోజుల క్రితం కర్నాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించారు. పలువురు పారిశ్రామికవేత్తలు సుముఖత వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన జపాన్ పర్యటనలో ఐటీతో పాటు ఎలక్ట్రానిక్ రంగాన్ని కూడా విశేషంగా ఆకర్షించాలని భావిస్తున్నారు. ఈ పర్యటనలో 80 శాతం ఐటీ రంగాన్ని ఆకర్షించడానికే కేటాయిస్తోందని తెలుస్తోంది. అలాగే ఎలక్ట్రానిక్ రంగంలో హిటాచీ, తోషిబా, సోనీవంటి ప్రముఖ పరిశ్రమలను ఏపీలో యూనిట్ల స్థాపనకు ఒప్పించాలని భావిస్తోంది. పర్యటనకు ముందుగా ఢిల్లీలోని జపాన్ దౌత్య కార్యాలయంలో ఆ దేశ పారిశ్రామికవేత్తలు 150 మందితో ఏపీ ఉన్నతాధికారులు శనివారం భేటీ అయ్యారు.
జపాన్ భాష చిక్కులు, అయినా..
జపాన్ పర్యటనలో చంద్రబాబు బృందానికి భాషా కష్టాలు ఎదురవుతున్నాయి. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో ముందంజలో ఉన్నందున జపాన్‌లోని పారిశ్రామికవేత్తలంతా ఇంగ్లీషులో నిష్ణాతులని అందరూ భావిస్తారు. కానీ, అక్కడి పారిశ్రామికవేత్తలకే కాదు.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్లెవరికీ ఇంగ్లీషు అంతగా రాదట. దీంతో అంతా జపనీస్ భాషలోనే ప్రజెంటేషన్ ఉండనుంది.
జపాన్ భాషలో విజిటింగ్ కార్డులు
జపాన్ పర్యటన నేపథ్యంలో ఈ మేరకు విజిటింగ్ కార్డులను కూడా జపనీస్ భాషలోనే ముద్రించారు. పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో ఎలాంటి అవ కాశాలున్నాయో వివరించే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా జపనీస్‌లోనే రూపొందించారు. కాగా, చంద్రబాబు అండ్ బృందం జపాన్ పర్యటన కోసం ఒకటిన్నర కోట్ల రూపాయలు విడుదలయ్యాయని తెలుస్తోంది.
ప్రధానితో బాబు భేటీ ఖరారు కాలేదు, ప్రజంటేషన్ జపనీస్‌లో: పరకాల
ఆదివారం సాయంత్రం పరకాల ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. జపాన్ ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ఇంకా ఖరారు కాలేదన్నారు. జపాన్ పర్యటనలో ఆరు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. వ్యవసాయం, విద్యుత్, టెక్నాలజీ తదితర రంగాల్లో ఒప్పందాలు ఉంటాయని చెప్పారు. వాణిజ్య శాఖతో ఎంవోయు కుదుర్చుకుంటామని చెప్పారు.
భారత దేశంలో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తోందన్నారు. జపాన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రంగా చేసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానిస్తూ జపనీస్ భాషలో ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. సీఐఐ నుండి 35 మంది పారిశ్రామికవేత్తలు ఈ పర్యటనలో భాగస్వాములు అవుతారని చెప్పారు.
ఒబామాను ఏపీకి రప్పించే ప్రయత్నం
అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా రిపబ్లిక్ దినోత్సవాల కోసం భారత్ రానున్నారు. ఆయనను ఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్‌కు కూడా రప్పించే ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నారని తెలుస్తోంది. ఒబామాను రప్పించి స్మార్ట్ సిటీల కోసం సహకారం కోరనున్నారని తెలుస్తోంది. ఒబామాను ఏపీకి రప్పించేందుకు చంద్రబాబు ఇప్పటికే పలువురితో టచ్‌లో ఉన్నారట.
అలాగే, ఎన్నారైల సహకారం కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒబామాను రప్పించడం ద్వారా స్మార్ట్ సిటీలకు సహకారం కోరడం, పెట్టుబడులు ఆకర్షించడం వంటివి చేస్తారని అంటున్నారు. ఒబామాను రప్పించే ప్రయత్నాలు ఫలించకుంటే.. ఢిల్లీలోనైనా ఆయనతో భేటీ అయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బిల్ గేట్స్ వంటి వారిని హైదరాబాద్ తీసుకు వచ్చారు. హైదారాబాదును ఐటీ రంగంలో మేటిగా నిలిపారు. అలాగే, ఇప్పుడు ఏపీని ఐటీ హబ్‌గా చేయాలని భావిస్తున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా చేయాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications