పవన్‌పై విమర్శలు చేయొద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు, కాకినాడ సభపై ఇలా
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో జరిగిన ఆత్మగౌరవ సభలో వాస్తవాలే మాట్లాడారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్‌లో నిర్వహించిన సభలో పవన్ చేసిన ప్రసంగంపై చంద్రబాబు స్పందించారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకోహోదా వస్తే ఎక్కువ సంతోషించేది తానేనని, అది వస్తే చాలా వెసులుబాటు వస్తుందని వ్యాఖ్యానించారు. నవ్యాంధ్ర రెండున్నరేళ్ల పసిబిడ్డ అని, ఎంతో జాగ్రత్తగా ఏపీని అభివృద్ధి చేసి భావితరాలకు అందజేస్తామన్నారు.

విభజన హామీలన్నీ నెరవేరాలన్నదే మా ఆకాంక్ష అని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ వాదనను మనం అర్ధం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోమని, హోదా కోసం మా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం ప్యాకేజీని స్వాగతించాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.
పవన్‌పై విమర్శలు చేయొద్దంటూ తెలుగుదేశం పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రం కోసం ఎవరి పద్ధతిలో వారు పోరాడొచ్చన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేకహోదా కోసం జగన్ పోరాడితే మంచిదేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మేలు జరిగే విషయంలో ఏదైనా ఫార్ములా ఉంటే చెప్పొచ్చన్నారు.
కాగా, రెండు రోజులుగా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. 1978 నుంచి తాను అసెంబ్లీలో ఉన్నానని, ఏనాడు హద్దులు దాటలేదని, సభకు వచ్చీ రావడంతోనే గొడవ మొదలు పెట్టారన్నారు.
అదే విధంగా స్పీకర్‌ను కించపరిచేలా వ్యవహరించారన్నారు. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు హద్దులు దాటి ప్రవర్తించారన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ది ఉన్మాద చర్య అని, చెడు నాయకత్వం వల్ల వైసీపీ సభ్యులు దారి తప్పుతున్నారని ఆయన అన్నారు. ఇక శనివారం వైసీపీ తలపెట్టిన బంద్‌పై కూడా చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్ర విభజన తరువా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలని మరింత ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నామని, ఇంకా మరింత ఇబ్బంది పెడతారా? అని అన్నారు. విపక్షాల బంద్‌కు ప్రజలు సహకరించొద్దని సూచించారు. ఏపీకి హోదా సాధన కోసం తాను రాజీనామా చేస్తానని, డబ్బులు మీరు తెస్తారా? అంటూ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications