విస్తుపోయేలా: బాబు ఆఫీసే కాదు, మంత్రులదీ, నో వర్క్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం అస్తవ్యస్తంగా ఉందట. కుర్చీలు లేక, కరెంట్ ఉండక.. ఇబ్బందులు పడుతున్నారట. ఫైళ్లు పరిశీలిద్దామంటే పంపిణీ పూర్తి కాలేదు. మంత్రుల కార్యాలయాల్లో అన్నీ అరకొర సౌకర్యాలనే ఉన్నాయట. ఫైళ్లన్నీ పేరుకుపోయాయట. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం చిందరవందరగా ఉన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబుదే కాకుండా ఏపీ మంత్రుల కార్యాలయాల్లోనే పూర్తి సౌకర్యాలు లేవట. దీంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారట.
పనుల మీద సచివాలయానికి వచ్చినవారు.. అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ఇది సచివాలయమా? లేక డంపింగ్‌యార్డా అని విస్తుపోయే పరిస్థితి ఉందట. విభజన నేపథ్యంలో సచివాలయంలోని బ్లాకులను కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి అపాయింటెడ్ డే (జూన్ 2) నాటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో విభజన, పంపిణీ అంతా పూర్తయి రెండు కొత్త ప్రభుత్వాలూ పని చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు.

రాష్ట్రపతి పాలన విధించి మరీ ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాల ప్రకారం అధికారులు సైతం దానిపై దృష్టి సారించారు. కానీ సచివాలయంలో పరిస్థితి ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉంది. ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరినీ తాత్కాలిక పద్ధతిలో కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాంబర్లు కూడా సరిగా లేవు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు కేటాయించిన ఎల్ బ్లాకు ఏడో అంతస్తులో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నారట.
కొన్ని బ్లాకుల్లో చాంబర్లు కేటాయించినా.. అందులో సరైన ఫర్నిచర్ లేకపోవడంతో, వారి వద్దకు వచ్చిపోయే సందర్శకులు, సంబంధిత అధికారులు నిలబడే ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డి బ్లాకులో రెండతస్తులు కేవలం ఆర్థిక శాఖ ఉద్యోగులు, ఉన్నతాధికారుల కోసం కేటాయించారు. ఇంత పెద్ద, విశాలమైన హాళ్లు, చాంబర్లు ఇతర ఏ బ్లాకుల్లోనూ కనిపించవు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖను హెచ్ నార్త్ బ్లాకులోకి మార్చారు. ఇక్కడ కేటాయించిన చాంబర్లు చాలక ఆ శాఖ సెక్రటరీలు ఇరుకు గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబుకు కేటాయించిన కార్యాలయం గదుల్లో ఇప్పటి వరకు చెత్తను శుభ్రం చేయలేదు. చంద్రబాబు అధికారిక కార్యకలాపాలను లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుండే కొనసాగిస్తున్నారు. కాగా, ఏపీ శాసన సభ్యులు ఇరుకైన అసెంబ్లీతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications