ముగిసిన టీడీఎల్పీ: నేతలకు చంద్రబాబు క్లాస్, కాల్‌మనీపై ఘాటుగా స్పందన
హైదరాబాద్: శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షమైన వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో గట్టిగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు స్వపక్ష నేతలకు సూచన చేశారు. గురువారం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సభలో శుక్రవారం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శుక్రవారం జరిగే శాసనసభలో తొలుత అంబేద్కర్ అంశంపై చర్చ ముగిసిన తర్వాతే కాల్ మనీ వ్యవహారంపై చర్చ చేపడదామని పార్టీ నేతలతో చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది.
అంబేద్కర్ అంశంపై చర్చ జరగనీయకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడితే సస్పెండ్ చేసేనా సభను జరిపించాలని సూచించినట్టు తెలుస్తోంది. శుక్రవారం కూడా టీడీఎల్పీ సమావేశం నిర్వహిస్తామని, ప్రభుత్వ పథకాలపై అసెంబ్లీలో చర్చ జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.

కాల్‌మనీ వ్యవహారంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే తమ వాదనను అసెంబ్లీలో సమర్ధవంతగా వినిపించాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీకి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎమ్మెల్యేలు గట్టిగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
కాల్‌మనీ వ్యవహారంలో ప్రభుత్వం కఠినంగా వ్వవహారిస్తోందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అత్యంత అవినీతిపరులు, క్రిమినల్స్ ఉన్న వైసీపీ పార్టీ టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గంగిరెడ్డి లాంటి వాళ్లను పార్టీలో పెట్టుకుని విమర్శలు చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారని చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలకు క్లాస్ పీకారు.
ఇది ఇలా ఉంటే తొలిరోజు సరైన స్ట్రాటజీతో వెళ్లలేదని చంద్రబాబుకు కొందరు నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇన్నేళ్ల తన రాజకీయ అనుభవంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
అవినీతి వ్యక్తుల విషయంలో అలెర్ట్‌గా ఉండాలని చంద్రబాబు టీడీఎల్పీ సమావేశంలో హెచ్చరించనట్లు తెలిసింది. కాగా గురువారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే కాల్‌మనీ వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైసీపీ పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications