రోజూ తలచుకుంటూనే ఉంటా: తిరుమలలో చంద్రబాబు
Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ఉదయం తిరుమల (Tirumala)ను సందర్శించారు. భార్య భువనేశ్వరితో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు ఆయనకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌లో కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. ఈ కేసులో 53 రోజుల పాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు.

శ్రీవారిని దర్శించడానికి గురువారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. తన భవిష్యత్ ప్రణాళికలను వివరించడానికి నిరాకరించారు.
తాను తిరుమల వెంకటేశ్వరస్వామి వారి పాద పద్మాల వద్ద పుట్టానని, అంచెలంచెలుగా ఎదిగానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సేవకు అంకితం అయ్యానని పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి తమ ఇంటి దైవం, అని ఆయనను తలచుకుని ఏ కార్యక్రమం అయినా ప్రారంభిస్తానని చెప్పారు.
2003లో అలిపిరి వద్ద తనపై 24 క్లెమోర్ మైన్స్ పేలినప్పుడు.. వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టారని చంద్రబాబు అన్నారు. తాజాగా కష్టం వచ్చినప్పుడు కూడా వేంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాను, ఆయన దర్శనం తరువాతే వేరే కార్యక్రమాలు మొదలుపెట్టాలని అనుకున్నట్లు చెప్పారు.

శ్రీవారిని తాను రోజూ తలచుకుంటూనే ఉంటానని, ధర్మాన్ని కాపాడాలి అని కోరుకుంటూ ఉంటానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి నంబర్ వన్‌గా నిలవాలనీ శ్రీవారిని వేడుకున్నానని అన్నారు.
తనకు ఆ భగవంతుడు ఏ సంకల్పం అప్పగించాడో, ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి శక్తి, సామర్థ్యం తెలివి తేటలు, ఆరోగ్యాన్ని ఇవ్వాలని వెంకటేశ్వరుడిని ప్రార్థించానని చంద్రబాబు వివరించారు. 45 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రపంచంలో జరిగే మార్పులన్నింటినీ తెలుగు వారికి సంక్షేమం కోసం రాష్ట్రానికి తీసుకొచ్చానని అన్నారు.












Click it and Unblock the Notifications