కేంద్రం అన్యాయంపై ఆగ్రహం, తొలిసారి బ్లాక్ షర్ట్‌తో వచ్చిన చంద్రబాబు: ఢిల్లీలో ఎంపీల నిరసన
Recommended Video

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక్కా ధరించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నిరసన కార్యక్రమాల్లో నల్ల బ్యాడ్జీలకే పరిమితమయ్యారు. కానీ తొలిసారి నల్ల చొక్కా ధరించారు.

అందుకే ముఖ్యమంత్రి హోదా ఉన్నా బ్లాక్ షర్ట్‌తో
కేంద్రానికి తమ నిరసన తెలియజేసేందుకు ముఖ్యమంత్రి హోదా ఉన్నప్పటికీ తమ పార్టీ అధినేత బ్లాక్ షర్ట్‌తో వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఏపీలో బంద్ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా కోసం హోదా సాధనా సమితి పిలుపునిచ్చిన ఈ బంద్‌లో వైసీపీ, జనసేన పాల్గొనడం లేదు. అయితే అధికార టీడీపీ పరోక్షంగా మద్దతు తెలిపింది.

దేవినేని అవినాష్ ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రజల హక్కు అని, దానిని సాధించే వరకు పోరాటం సాగిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు దేవినేని అవినాష్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకే గూటి పక్షులు అని, అందుకే అదేపనిగా తెలుగుదేశం పైన విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు.
హోదా కోసం ఢిల్లీలో నిరసన
మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో గల మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఏపీకి హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు నిరసన తెలుపుతుండటం గమనార్హం. ఏపీకి హోదా ఇవ్వాలని వారు నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications