చంద్రబాబు సరికొత్త టెక్నాలజీ...'TDP రేడియో'!
చదువురానివారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని.. వారికి కూడా చేరాలనే ఉద్దేశంతో రేడియో కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ తరహా లో తెలుగుదేశం పార్టీ అధినేత అధినేత చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా రేడియో కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. ఏదైనా పెద్ద సంఘటన జరిగితే వెంటనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని చంద్రబాబు వాయిస్ ద్వారా ఆడియోను అందరికీ పంపిస్తారు. తద్వారా సమాచారం పూర్తిగా పార్టీ శ్రేణులకు చేరుతుందని పార్టీ భావిస్తోంది. సోషల్ మీడియాను అన్నివిధాలుగా ఉపయోగిస్తున్న టీడీపీ తాజాగా రేడియోను పరిచయం చేయబోతోంది.

సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు రేడియో
గన్నవరంలో వైసీపీ చేసిన దమనకాండ ను వివరిస్తూ చంద్రబాబునాయుడు బహిరంగ లేఖ రాశారు. దానికి సోషల్ మీడియా వేదికగా ప్రచారం కల్పించారు. టీడీపీ అధికార పత్రిక చైతన్యరథం ద్వారా కూడా శ్రేణుల వద్దకు తీసుకెళ్లారు. అనుకున్నస్థాయిలో అందరికీ చేరలేదనే అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇకనుంచి దీనికి విరుగుడుగా సమాచారాన్ని వాయిస్ రూపంలో అందజేయాలని భావిస్తున్నారు.

వాయిస్ రూపంలో చేరువ చేయాలి
చదువురానివారు సోషల్ మీడియాకు దూరంగా ఉంటారని.. వారికి కూడా చేరాలనే ఉద్దేశంతో రేడియో కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇకనుంచి టీడీపీ అధిపతి, ఇతర కీలక నాయకుల సందేశాలను వాయిస్ ఓవర్ రూపంలో మరింత చేరువ చేయాలనుకుంటున్నారు. యువగళంలో ఇదే తరహా కార్యక్రమాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇది నెటిజన్లను ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

సాంకేతిక లోపాలు సరిదిద్దుతున్నారు
సోషల్ మీడియా వేదికగా ఆన్ లైన్ రేడియోలను మనం వింటున్నాం. ఎఫ్ఎంలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రత్యేకంగా టీడీపీ ఎఫ్ఎం రేడియో మాదిరిగా ఒక ఫ్రీక్వెన్సీని తీసుకోవాలనుకుంది. అయితే, కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఆ సిగ్నల్స్ వెళ్లే అవకాశం ఉండటంతో వెబ్ రేడియోలను డిజైన్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ల ద్వారా ఆ రేడియోను వినిపించడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 5జి అందుబాటులో ఉన్నప్పటికీ నెట్ వర్క్ అన్ని ప్రాంతాల్లో లేదు. ఒకవేళ ఉన్నప్పటికీ వీడియోలు ప్లే కావడానికి డేటా అవసరపడుతుంది. తక్కువ డేటా ఉన్న ఫోన్లలో కూడా ప్లే అయ్యేలా ఆడియోను పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సరికొత్త ప్రయోగం టీడీపీ సోషల్ మీడియాను మరింత పటిష్టపరుస్తుందని భావిస్తున్నారు. గన్నవరం ఎపిసోడ్ ను ఆడియోరూపంలో రేడియో ద్వారా విడుదల చేశారు. రాబోయే రోజుల్లో సాంకేతిక లోపాలను సరిదిద్ది రేడియోను ప్రజలకు మరింత చేరువు చేయడానికి టీడీపీ సాంకేతిక విభాగం ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications