ఏపి అభివృద్ధి చెందాలని లేదా? బెట్టు చేస్తే కుదరదు: ఉద్యోగులపై చంద్రబాబు
అమరావతి: హైదరాబాద్ నుంచి ఉద్యోగులు అమరావతికి ఈ ఏడాది వచ్చేస్తేనే మంచిదని, ఇబ్బందులు ఎదురవుతాయని బెట్టు చేయడం కుదరదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏపీ ఉద్యోగులకు తేల్చిచెప్పారు. శనివారం విజయవాడలోని సీఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
విద్యాసంవత్సరం ప్రారంభంలో రాకపోతే మళ్లీ ఇబ్బంది తప్పదని తెలిపారు.
వచ్చిన వెంటనే ఒకట్రెండు రోజులు ఇబ్బందులుండటం సహజమేనని, తాను కూడా విజయవాడకు వచ్చిన కొత్తలో బస్సులోనే నిద్రించానని చెప్పారు. ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ప్రయత్నిస్తున్నామని, వారికి కూడా రావాలన్న సంకల్పం ఉండాలన్నారు.
కొంత త్యాగాలు చేయక తప్పదని స్పష్టం చేశారు. విభజన జరిగి రెండేళ్లయిందని, మూడో సంవత్సరం కూడా అమరావతికి రాకపోవడం సరికాదని హితవు పలికారు. 'ఏపీకి రాలేము' అని బెట్టు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు.
'ప్రజల కోసం అందరూ రావాల్సిందే. నాకూ మనవడిని చూడాలని అనిపిస్తోంటుంది. అయినా ఇక్కడే ఉంటున్నా. ఉద్యోగులు కూడా అన్నీ అర్థం చేసుకోవాలి. వారికి వెసులుబాటు కల్పించేందుకే 5 రోజుల పనిదినాలు అమలు చేస్తామన్నాం. 'ఈ-కార్యాలయం' విధానం తీసుకొచ్చాం' అని చంద్రబాబు వివరించారు.
'పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉందని ఇక్కడికి రాకపోతే విజయవాడ, అమరావతి అభివృద్ధి చెందుతుందా? ఆలోచించాలి. నాకైతే తొలి ఏడాదే ఇక్కడకు వచ్చి చెట్ల కింద కూర్చొనైనా పరిపాలన చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది' అని చంద్రబాబు అన్నారు.

తాత్కాలిక సచివాలయం పనులను అనుకున్నట్లే జూన్ 3లేదా 4వ వారానికల్లా పూర్తిచేస్తామని చెప్పారు. సచివాలయం శాశ్వత భవనం అందుబాటులోకి రావాలంటే మరో మూడు నాలుగేళ్లు పడుతుందని అన్నారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి మాకీ సంస్థ ఇచ్చినవి తుది ఆకృతులు కావని, అవి కేవలం ఆర్కిటెక్ట్ ఎంపికకే ఉపయోగించామని చెప్పారు.
ఆర్కిటెక్ట్ ఎంపిక పూర్తయిన తర్వాత ఏ విధమైన ఆకృతి కావాలన్నదానిపైన చర్చకు పెడతామని, అందరి అభిప్రాయాలన్ని తెలుసుకుంటామని తెలిపారు. హైటెక్‌సిటీ నిర్మాణానికి ఎల్‌అండ్‌టీ సంస్థ పది ప్లాన్‌లు ఇస్తే వాటన్నింటినీ తిరస్కరించి మళ్లీ తయారు చేయించానని గుర్తు చేశారు.
కాగా, ప్రత్యేక హోదా అంశంలో రాజీపడటం లేదని చంద్రబాబు చెప్పారు. 'కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడగలేదని నన్ను విమర్శిస్తున్నవారు.. ప్రత్యేకహోదా కలిగిన పది రాష్ట్రాలు పదేళ్ల పాటు ఆ హోదా అనుభవించి కూడా ఏ స్థానంలో ఉన్నాయో ఒక్కసారి చూడాలి' అని అన్నారు.
'14వ ఆర్థిక సంఘం నివేదికల ప్రకారం అన్ని రాష్ట్రాల కంటే అవి వెనుకన ఉన్నాయి. వాటికంటే మనం ముందున్నాం. ప్రత్యేక హోదా ఉన్నంత మాత్రాన కష్టపడకపోతే ఫలితం రాదు. ఆ రాష్ట్రాల్లో వనరులున్నా వారు సరిగ్గా కష్టపడలేదు. మనం కూడా కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది' చెప్పారు.
'కొందరు ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు' అంటూ ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications