కొత్త ఎస్పీలకు చంద్రబాబు టార్గెట్ ఇదే..! ఆ రెండు కేసుల ప్రస్తావన..!
ఏపీలో ఇవాళ 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన సీఎం చంద్రబాబు.. వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి మరోసారి గుర్తుచేసారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలంటే పోలీసు శాఖ తరఫున కావాల్సిన సహకారాన్ని వారికి వివరించారు. అంతే కాదు రాష్ట్రంలో గతంలో సంచలనం రేపిన వైఎస్ వివేకా హత్య కేసు, జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య కేసుల్ని ప్రస్తావించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని కొత్త ఎస్పీలకు చంద్రబాబు తేల్చిచెప్పేశారు. ఈ విషయంలో రాజీ పడబోమన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర వృద్ధి రేటు పెరుగుతుందన్నారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎంగా ఇదే తన విధానమని గుర్తుచేసారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించొద్దని ఎస్పీల్ని ఆదేశించారు. నేరాల తీరు మారిందని, కొత్త తరహా నేరాలు, కొత్త తరహా నేరస్తులు వచ్చారని గుర్తుచేశారు. ఈ విషయంలో పోలీసులు కూడా అప్ డేట్ కావాలన్నారు.

అన్ని కోణాల్లో ఆలోచించి మీకు ఎస్పీలుగా అవకాశం ఇచ్చానని వారికి చంద్రబాబు తెలిపారు. బెస్ట్ ఫెర్మామెన్స్‌తో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. తొలిసారి సీఎం అయినప్పటి నుంచి తన ఫోకస్ లా అండ్ ఆర్డర్ మీదే ఉండేదని, ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీయిజం, మత ఘర్షణలు వంటి వాటి విషయంలో చాలా కఠినంగా ఉండేవాడినని తెలిపారు. గతంలో తాను చాలా కఠినంగా ఉన్నాను కాబట్టే అలిపిరిలో తనపై నక్సల్స్ దాడి చేశారన్నారు.

ఒకప్పుడు రాజకీయ నాయకులు అవసరానికి రౌడీలను, క్రిమినల్స్‌ను వాడుకునే వాళ్లని, అయితే ఇవాళ రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారని సీఎం తెలిపారు. పాలిటిక్స్‌ను క్రిమినలైజ్ చేశారన్నారు. వివేకా హత్య విషయంలో ఏం జరిగిందో ప్రతి పోలీసు అధికారి స్టడీ చేయాలన్నారు. అలాగే జగన్ కారు కింద పడి చనిపోయిన సింగయ్య మృతిని ప్రస్తావించారు. వీడియో బయటికి రాకపోతే ఆ విషయం తెలిసేది కాదన్నారు. నేరాల తీరు మారింది కాబట్టి దర్యాప్తు తీరు కూడా మారాలన్నారు. సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలని, మహిళల వ్యక్తిత్వ హననం చేసే వాళ్లను ఉపేక్షించొద్దని సూచించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పేదానిలో మంచి ఉంటే పాటించాలని, తప్పు ఉంటే చేయమని చెప్పేయమన్నారు.












Click it and Unblock the Notifications