ఆడబిడ్డలకు సెల్‌ఫోన్లు, మీట నొక్కితే చాలు: బాబు
కర్నూలు: తాము అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే పోలీసుస్టేషన్లకు ఫోను చేయనక్కర్లేదని, దగ్గరున్న ఫోను నుంచి ఒక్క నెంబరు నొక్కితే చాలునని, మూడు నుంచి ఐదు నిమిషాల్లో ఆదుకోవడానికి వారే పోలీసులే దగ్గరకొస్తారని ఆయన చెప్పారు. అందుకు గాను తాము అధికారంలోకి వస్తే మహిళలందరికీ సెల్‌ఫోన్‌లు ఇస్తామని, అవసరమైనంతమంది వలంటీర్లను నియమించి ఆదుకుంటామని చెప్పారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచుతానని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్థులతో సమానంగా వారి వేతనాలను పెంచుతానని హామీ ఇచ్చారు. సీమాంధ్రలో అధికంగా ఎంపీ స్థానాలు ఇస్తే కేంద్రంలో అనుకూల ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. అధిక శాతం ఎమ్మెల్యేల స్థానాలిస్తే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీమాంధ్రను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని దబాయించి నిధులు మంజూరు చేయించుకునే శక్తి తనకుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం కర్నూలులో జరిగిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రసంగించారు.

ప్రజలకు చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ తప్పు చేసిందని, సోనియాకు అనుభవం లేదని, అందుకే సోనియా గాడ్సే చేసిన తప్పుతో కాంగ్రెస్ శిక్ష అనుభవిస్తోందని ఆయన అన్నారు. తమ పార్టీ కోసం గొయ్యి తవ్వారని, ఇప్పుడు వాళ్లే అందులో పడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. బిసిలకు రూ.10వేల కోట్లను కేటాయించి తెలంగాణ, సీమాంధ్రల్లో వేర్వేరు మ్యానిఫెస్టోలు తయారు చేస్తామని ఆయన చెప్పారు. రూ.2500 కోట్లతో ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
హైదరాబాదును ఎవరు అభివృద్ధి చేశారో తేల్చుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును చర్చకు రావాలని ఆహ్వానించానని, దమ్ములేని కెసిఆర్ ఫాం హౌస్‌లోకి పారిపోయాడని ఆయన అన్నారు. తెలంగాణలో రామబాణం వదిలానని, అక్కడ బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చానని, ఆ దెబ్బతో కాంగ్రెస్ రెండు పిసిసిలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.
కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని, చేతనైతే అభివృద్ధి చేయాలి గానీ తెలుగుజాతిని విడగొట్టొద్దని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఒక సైకో అని, మంచివారినే తమ పార్టీలోకి తీసుకుంటున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications