ఫామ్‌హౌస్‌కు కెసిఆర్ పరారీ, కాంగ్రెసు దొంగలు: బాబు
నెల్లూరు: కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన బుధవారం రాత్రి నెల్లూరులో జరిగిన ప్రజాగర్జన సభలో ప్రసంగించారు. సీమాంధ్రను స్వర్ణాంధ్రగానూ తెలంగాణను సామాజిక తెలంగాణగానూ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల్లోను తమ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
జాతి, మతం, అనుబంధంపై కాంగ్రెస్ చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని విభజించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన పనులకు జనం ఎంతో బాధతో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ దొంగలు, జైరాం రమేశ్ వంటి వాళ్లా తెలుగు వారి రాతలు రాసేది? వారిని భూస్థాపితం చేసి తీరుతామని అన్నారు. వారు తీసిన గోతిలో వారే పడ్డారని, ఇక మట్టి వేసి సిమెంటుతో ఆ గోతిలో పడ్డ కాంగ్రెస్ నేతలను పూడ్చేయాలని ఆయన అన్నారు. విభజనతో నదీ జలాలు, నిరుద్యోగం తదితర సమస్యలు పట్టి పీడిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ఎవరు? నే.నా లేక కేసీఆరా లేదంటే కాంగ్రెస్ దొంగలా? ఈప్రశ్న వేస్తే కేసీఆర్ ఫాం హౌస్‌కి పారిపోయారని అన్నారు. చిదంబరం కౌంటింగ్‌లో మాయ చేసి గెలిచాడని, మొయిలీ బెంగుళూరులో అడ్రస్ లేడని, షిండే, ఆంథోనిలు రక్షణ శాఖ కుంభకోణాల్లో కూరుకుపోయారని, వీరా నీతులు చెప్పేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్ సోనియా దత్త పుత్రుడని చంద్రబాబు విమర్శించారు.
జగన్‌ను నవతరం నాయకుడని చెబుతుండటం విడ్డూరమని, దోపిడీతరం నాయకుడిగా పిలవాలని అన్నారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జగన్ ఆస్తులని అటాచ్‌మెంట్ చేసి రూ.వెయ్యి కోట్లకుపైగా ఆస్తులను జప్తు చేశారని గుర్తు చేశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా పెద్ద అవినీతి అనకొండని విమర్శించారు.
బైబిల్ పెట్టుకుని కొందరు వైయస్సార్ కాంగ్రెసు నేతలు నటిస్తున్నారని, వారి మాటలకు క్రిష్టియన్లు మోసపోవద్దని చంద్రబాబు అన్నారు. దళిత క్రిష్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తామని, కాపుల కోసం కమిషన్ వేసి బిసి రిజర్వేషన్ అమలు చేస్తామని, కులమతాలకు అతీతంగా అందరిని ఆదుకుని హక్కున చేర్చుకుంటామన్నారు.
చంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డిలతోపాటు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారి అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications