ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై టీతో చంద్రబాబు బేరాలు
న్యూఢిల్లీ: తమ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేది లేదని మొండికేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ప్రతిపాదనను పెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తంలో తమ ప్రభుత్వం 58 శాతం చెల్లిస్తుందని, మిగతా 42 శాతం తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఆయన ప్రతిపాదించారు. 1956ను కొలమానంగా ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారని, దాన్ని ఎవరు నిర్ణయిస్తారని ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడినవారు చాలా మంది ఉన్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకూడదని ఆయన అన్నారు. విద్యార్థుల ఫీజులకు 4 వేల కోట్ల రూపాయలు అవుతాయని చంద్రబాబు చెప్పారు.

భద్రాచలం గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్‌లో చేరుతున్నాయని, వారికి స్థానికతను ఎలా నిర్ణయిస్తారని ఆయన అన్నారు. మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది తెలంగాణలో స్థిరపడ్డారని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రతిపక్షంలో ఉందని, వచ్చే ఎన్నికల్లో తాము పోటీ పడుతామని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని తాను కోరుతున్నానని ఆయన అన్నారు.
తాను ఏది అడిగినా ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అడగడం లేదని, తెలంగాణకు కూడా అడుగుతున్నానని ఆయన గుర్తు చేశారు. గొడవలు వద్దని, తాము ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో 58 శాతం భరిస్తామని, తెలంగాణ 42 శాతం భరించాలని ఆయన అన్నారు. కలిసి ఉండే మార్గం ఆలోచించాలని గానీ విద్వేషాలతో, విభేదాలతో ముందుకు పోవడం సరి కాదని ఆయన హితవు చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌కు ఫోన్
చంద్రబాబు నాయుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌కు ఫోన్ చేసి రైతుల రుణాల రీషెడ్యూల్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దుస్థితి గురించి చెప్పారు. అయితే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌తో మాట్లాడాలని చంద్రబాబుకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సూచించారు.
రాజ్యసభలో ప్రస్తావిస్తాం...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను పరిష్కరించుకోవాలని తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరి సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్‌లో ఒక రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు మరో రాష్ట్రంలో సీట్లు రావచ్చునని, ఇతర రాష్ట్రాలకు చెందినవారికి ఫీజులు చెల్లించబోమని అనడం సరి కాదని ఆయన అన్నారు. ఈ విషయాన్ని, మీడియాపై తెలంగాణ ప్రభుత్వ వైఖరిని రాజ్యసభలో లేవనెత్తుతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications