ఆంధ్రా పేరు చెప్పి, ఫస్ట్ నేనే బాధపడతా: కేసీఆర్‌పై బాబు
హైదరాబాద్: ఆంధ్రా నాయకుల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదన్నారు. బేగంపేట దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టింది తామే అన్నారు. ఆ రోజు రాజీవ్ గాంధీ పేరు మార్చే అవకాశమున్నా మార్చలేదన్నారు. శంషాబాద్ విమానాశ్రయం తమ వల్లే వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరు పెడతామని 2009కి ముందే చెప్పామన్నారు.
ఎన్టీఆర్ తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారన్నారు. ఇక్కడ ప్రాజెక్టులు, పెన్షన్లు, పక్కా ఇళ్లు కట్టించింది ఎన్టీయారే అన్నారు. తెలంగాణలో చాలామంది మహానుభావులు తెలుగు జాతి కోసం పోరాడారన్నారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ లాంటి వారు జాతి కోసం పోరాడారని, వారు ఏ ఒక్క ప్రాంతానికి చెందిన వారు కాదన్నారు. ఏపీలో తెలంగాణ యోధుల విగ్రహాలు పెడతామన్నారు.

సభలో మాట్లాడుతూ.. ఆపరేషన్ బ్లూస్టార్ అంటున్నారని, మనం అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు. బ్లూస్టార్ అపరేషన్ చేస్తే కాంగ్రెస్ కనుమరుగైందని, అక్కడి నుండే ఆ పార్టీ పతనం ప్రారంభమైందని, ఈ రోజు శాశ్వతంగా ఆ పార్టీ లేని పరిస్థితి వచ్చిందన్నారు. అలా చేస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, అభివృద్ధి చేయబోయేది కూడా టీడీపీయే అన్నారు. హైదరాబాదును ప్రపంచ పటంలో నిలిపామన్నారు. తెరాస కుట్రలను తాము తిప్పి కొడతామన్నారు. ఎన్టీఆర్ పేదల హక్కులు కాపాడారన్నారు. టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడం న్యాయం, ధర్మం అన్నారు.
ఒకప్పుడు ఉన్న పేరును తొలగించారు కాబట్టి ఆ పేరు పెట్టారన్నారు. మనం భౌగోళికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉండాలన్నారు. ఎన్టీఆర్ వల్లే కేసీఆర్, జానా రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఇప్పుడు మాట్లాడుతున్న నేతలు ఎన్టీఆర్ వల్లే పైకొచ్చారన్నారు. పీవీ, చాకలి ఐలమ్మ, కొమరం బీంను కొత్త రాష్ట్రం గుర్తుంచుకుంటుందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటే ముందు బాధపడేది తానే అన్నారు.












Click it and Unblock the Notifications