విజిటిఎంలో రాజధాని! బాబు దృష్టి, భూములకి రెక్కలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ - గుంటూరు మధ్య ఏర్పాటయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ? అనే దానిపై చాలా రోజులుగా చర్చ సాగుతోంది. విజిటిఎం (విజయవాడ- గుంటూరు- తెనాలి- మంగళగిరి) పరిధిలోనే ఏర్పాటుకు దాదాపు నిర్ణయించినట్టుగా తెలుస్దోంది.
హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అధారిటీ విస్తీర్ణం కన్నా దాదాపు వెయ్యి చదరపు కిలోమీటర్లు ఎక్కువగా ఉన్న విజిటిఎంలో రాజధాని నిర్మాణానికి అవసరమైన వనరులు, అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అధికార్లు గుర్తించారు. ఇదే ప్రాంతంపై కాబోయే సిఎం చంద్రబాబు కూడా దృష్టి పెడుతున్నారట.

అధికారుల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుంటున్నారు. అయితే విజిటిఎం పరిధిలో ఎక్కడ రాజధాని ఉంటుందనేది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. కొత్త రాజధాని ఎంపికపై ఇప్పటికే కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఇటీవల నాలుగు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయి వివరాలు, పరిస్థితులను అధ్యయనం చేసింది.
ఇందులో విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ప్రాంతాలే కొత్త రాజధానిని అనుకూలంగా ఉంటాయన్న భావానికి వచ్చారట. ఇదే సమయంలో పట్టణాభివృద్ధి శాఖ అధికారులు కూడా విజిటిఎం పరిసరాలపై కేంద్రానికి ఒక నివేదిక కూడా పంపించారు. విజిటిఎం అభివృద్ధి సంస్థ 7068 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది.
దీని పరిధిలో గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లు, తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు మున్సిపాల్టీలు ఉండగా, మరో 820 గ్రామాలు ఉన్నాయి. ఇక దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ కన్నా విజిటిఎం విస్తీర్ణం అతి పెద్దది. హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ విస్తీర్ణం 6300 చదరపు కిలోమీటర్లు కాగా, విజిటిఎం విస్తీర్ణం 7068 చదరపు కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో వౌలిక సౌకర్యాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.
గతంలో అనుకున్న మాదిరిగా నగరాల్లో కాకుండా పట్టణాల్లోనే రాజధాని నిర్మించాలని భావిస్తే విజిటిఎం పరిధిలో ఉన్న నాలుగు మున్సిపాల్టీల్లో మంగళగిరి లేదా నూజివీడు మున్సిపాల్టీలను ఎంపిక చేసే అవకాశాలు ఉంటాయంటున్నారు. చంద్రబాబు ఈ ప్రాంతాల్లోని రైలు, రోడ్డు, విమాన మార్గాలకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేస్తున్నారట. మరోవైపు గుంటూరు - విజయవాడల్లోనే రాజధాని అనే ప్రచారం నేపథ్యంలో భూముల రేట్లకు రెక్కలు వచ్చాయి.












Click it and Unblock the Notifications