చంద్రబాబు మార్క్ పొలిటికల్ "విజన్" : సీఎం జగన్ ధీమాపై బ్రహ్మాస్త్రం..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తన లక్ష్యం ఫిక్స్ చేసుకున్నారు. ఎన్నికల వ్యహాలు అమలు చేస్తున్నారు. రాజకీయంగానే కాదు..కొత్త మైండ్ గేమ్ ప్రారంభించారు. తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. ఏపీలో అధికారం దక్కించుకొనేందుకు ఏ ఒక్క అవకాశం వదులుకొనేందుకు చంద్రబాబు సిద్దంగా లేరు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమం ఓట్లు కురిపిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది.
దీనికి విరుగుడు రాజకీయం చంద్రబాబు మొదలు పెట్టారు. హైదరాబాద్ వేదికగా పావులు కదుపుతున్నారు. అమరావతి పై వయా ఢిల్లీ గురి పెట్టారు. చంద్రబాబు వ్యూహం సక్సెస్ అవుతుందా. ఢిల్లీలో కదలిక వస్తుందా అనేదే ఇప్పుడు చర్చ.

చంద్రబాబు టార్గెట్ సీఎం జగన్
టీడీపీ అధినేత చంద్రబాబు తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారమే లక్ష్యంగా కొత్త అడుగులు వేస్తున్నారు. ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. తాను లేకపోతే ఏపీకి నష్టం జరుగుతోందనే అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అందు కోసం పలు వేదికలను సద్వినియోగం చేసుకుంటున్నారు.
హైదరాబాద్ వేదికగా తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి గురించి ఇప్పుడు భారీ ప్రచారం దక్కేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ విస్తరణకు తాను ఏ రకంగా కష్టపడిందీ వివరించారు.
తన విజన్ ఏ విధంగా ఉంటుందో చెప్పుకొచ్చారు. అదే తరహాలో అమరావతిని అభివృద్ధి చేద్దామనేది తన లక్ష్యమని వివరించారు. తాను అధికారం కోల్పోవటంతో ఏపీ నష్టపోతుందోనే అభిప్రాయం కలిగించేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ తన స్థాయిలో అభివృద్ధి చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

జగన్ సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధి తో కౌంటర్
ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారంలోకి రావటానికి తాను చేసిన సంక్షేమాన్ని ప్రధానంగా నమ్ముకుంటున్నారు. ప్రతీ ఇంటికి మేలు చేసామని..ఖచ్చితంగా తమకు అది కలిసి వస్తుందని విశ్వసిస్తున్నారు. తాము అధికారంలోకి రాకపోతే పేదలకు నష్టం జరుగుతందని చెప్పుకొస్తున్నారు. ప్రతిపక్షాలు పెత్తందార్లకు మద్దతుగా నిలుస్తున్నారంటూ వ్యూహాత్మ నినాదం తెర పైకి తెచ్చారు.
ప్రధాన ఓటింగ్ వర్గాలను తన వైపు తిప్పుకొనేలా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అయితే, చంద్రబాబు తాను సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేస్తానని చెబుతూనే.. రాష్ట్ర భవిష్యత గురించి ప్రధాన ప్రచారస్త్రంగా మలచుకుంటున్నారు. ప్రధానంగా మధ్యతరగతి..యువత..ఉద్యోగుల ఓట్ల పైన గురి పెట్టారు. హైదరాబాద్ లో స్థిరపడి ఏపీ మూలాలు ఉన్న వారి ఓటింగ్ ను ప్రభావితం చేసే వ్యూహాలకు పదును పెట్టారు.
సీఎం జగన్ పేదలు నిన్నటి కంటే ఈ రోజు బాగుండటమే అభివృద్ధిగా విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధి తనతో మాత్రమే సాధ్యమనే నినాదం మరో సారి తెర మీదకు తెస్తున్నారు. హైదరాబాద్ కోసం అంతగా చేసినా 2004 ఎన్నికల్లో అక్కడ సీట్లు రాకపోవటాన్ని ప్రస్తావిస్తూ సెంటిమెంట్ పండిస్తున్నారు. అదే అమరావతి విషయంలోనూ అమలు చేస్తున్నారు.

విజన్ పాలిటిక్స్ తో ప్రధాని వద్ద మార్కులు
ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవంటూ చంద్రబాబు అండ్ టీం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అభివృద్ధి విషయంలో వైసీపీ టీడీపీ ప్రచారాన్ని సరైన రీతిలో తిప్పి కొట్టేలేకపోతోంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు అనుకూలంగా మలచుకుంటున్నారు. తాజాగా ప్రధాని వద్ద జరిగిన జీ 20 అఖిలపక్ష సమావేశంలోనూ తన విజన్ డాక్యమెంట్ సమర్పించారు.
చంద్రబాబు వద్దకు ప్రధాని నేరుగా నీతి అయోగ్ సీఈవో ను పంపారు. 1990 దశకంలో తాను హైదరాబాద్ అభివృద్ధికి ఆలోచన చేసానని.. ఇప్పుడు ఏపీ భవిష్యత్ కు తాను మాత్రమే సరైన విజన్ అందించగలనని ప్రజల్లో ఆలోచన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
అటు పొత్తులు ..ఇటు భవిష్యత్ పైన నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తూ ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. అయితే, ఇదే అభివృద్ధి కాన్సెప్ట్ తో అమరావతి విషయంలో చెప్పినా 2019 ఎన్నికల్లో అమరావతి పరిధిలోనూ టీడీపీ ఓడిన అంశాన్ని వైసీపీ గుర్తు చేస్తోంది. కానీ, ఇప్పుడు చంద్రబాబు తిరిగి అదే విజన్ అస్త్రంతో ఏపీ ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications