పిచ్చి తుగ్లక్ ఇప్పుడు పిచ్చి జగన్ రూపంలో; వైసీపీని శాశ్వతంగా సమాధి చేస్తేనే భవిష్యత్: చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సంపదనంతా కుక్కల పాలు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు మండిపడ్డారు. రెండున్నర ఏళ్ల పాలనలో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వం దేశంలో మరేదీ లేదని వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అంటూ చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

రెండేళ్లలో ఇంత అప్రదిష్టపాలైన ప్రభుత్వంఎక్కడా చూడలేదు
పిచ్చి తుగ్లక్ జుట్టుపై పన్ను వేస్తే, జగన్ రెడ్డి చెత్త పై పన్ను వేస్తున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు. పిచ్చి తుగ్లక్ ను ఇప్పుడు పిచ్చి జగన్ రూపంలో చూస్తున్నాం అంటూ మండిపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నేరుగా తాడేపల్లి డ్రగ్స్ వస్తున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం అంత అప్రతిష్ట పాలైన సర్కార్ ఎక్కడా చూడలేదని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పాలన అవినీతి,ఉన్మాదం,విధ్వంసకర పాలన అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డారు.

ఏపీని బీహార్ మాదిరిగా మార్చే పరిస్థితి వచ్చింది
ఏపీని బీహార్ మాదిరిగా మార్చే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని కొనసాగిస్తే రెండు లక్షల కోట్ల ఆస్తి రాజధాని నగరం ద్వారా వచ్చేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు గొడవలు పడి మన నీటి హక్కులను కూడా లేకుండా చేశాయని, రెండు రాష్ట్రాల నీటి హక్కులను కేంద్రానికి అప్పగించాయని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తప్పు చేసిన పోలీసులకు శిక్ష తప్పకుండా పడుతుందని హెచ్చరించారు చంద్రబాబు. ఇప్పటికే రాష్ట్రానికి జరగరాని నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.

నీరు చెట్టు స్కీం కాంట్రాక్టర్లకు చివరిరూపాయి ఇచ్చే వరకు టీడీపీ కృషి
ప్రస్తుతం జరిగిన నష్టాన్ని రిపేర్ చేయాలంటే చాలా సమయం పడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో భాగంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు వైసీపీ సర్కార్ బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతోందని, చివరి రూపాయి చెల్లించేవరకూ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా పనులు నిలిపి వేసి నీటి సంఘాల ప్రతినిధులు, చిన్న రైతులు రోడ్డున పడేలా చేసిందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.

నీరు చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టిఆర్ భవన్లో నీరు చెట్టు పెండింగ్ బిల్లుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు చంద్రబాబు. 1277 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన బిల్లులు సిఎఫ్ఎంఎస్ లో టోకెన్ కింద పడి పెండింగ్లో ఉన్నాయని, మంజూరు కావాల్సినవి మరో 500 కోట్ల వరకు ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి , చిన్న నీటిపారుదల శాఖలను సమన్వయం చేసుకుంటూ దేశంలోనే మొదటి సారి నీరు ప్రగతి కింద టిడిపి హయాంలో 18,265 కోట్లు వెచ్చించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టామన్నారు.

కక్ష సాధింపులో భాగంగా కాంట్రాక్టర్ ల బిల్లులు నిలిపేసిన జగన్ సర్కార్
నీరు చెట్టు ద్వారా భూగర్భ జలాలను పెంచటానికి టిడిపి ప్రభుత్వం చేసిన కృషికి 9 మెరిట్ స్కాచ్ అవార్డులు నాటి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాయని గుర్తు చేసిన చంద్రబాబు, ప్రస్తుతం కక్షపూరితంగా పనులు నిలిపి వేశారు అంటూ ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు చివరి రూపాయి చెల్లించే వరకు కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే కాదు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్న ఆ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications