వైసీపీ నేతలకు చంద్రబాబు ఆఫర్
బాపట్ల: వైసీపీ పాలనకు ముగింపు పలకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని విషయంలో వైసీపీ మూడు ముక్కలాట ఆడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేదని, ప్రస్తుతం ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఓటు వేసిన వారినే కాటు వేసే రకం జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. నా ఎస్సీలు అంటూ వారి నెత్తిమీదే చెయ్యి పెడతారని, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలే అని విమర్శించారు. దళితులకు చెందిన 25 కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేశారని, జగన్ దళితులను అన్ని రకాలుగా మోసం చేశారని ఆరోపించారు. మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిందని మండిపడ్డారు చంద్రబాబు. నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నారని, ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం మద్యం తాగి అనేకమంది ప్రాణాలు పోతున్నాయని ధ్వజమెత్తారు. రోడ్లపై గుంతలు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులెలా కడతారని చంద్రబాబు నిలదీశారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని ధ్వజమెత్తారు.
దేశంలో మహిళలను గౌరవించిన ఏకైక పార్టీ తెలుగుదేశం అని చంద్రబాబు తెలిపారు. తన ముందుచూపు వల్ల ఆడపిల్లకే ఎదురుకట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. పిల్లలే మన ఆస్తి అని, వారే మన సంపద అని అన్నారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తమది అని వ్యాఖ్యానించారు. వచ్చిన సంపదను పేదలకు పంచడం తమకు తెలుసన్నారు చంద్రబాబు.
— N Chandrababu Naidu (@ncbn) April 12, 2024
ఇక, అప్పులు తేవడం, సహజ వనరులను దోచేయడమే జగన్‌కు తెలుసు అని విమర్శించారు చంద్రబాబు. యువతకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత తనది అని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మంచి డ్రైవర్‌ను తానేనని అన్నారు. రివర్స్ గేర్‌లో వెళ్తూ ప్రజల జీవితాలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలనే దృఢసంకల్పంతో వచ్చానన్నారు. ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వంలో ఎంత పూర్తి చేశారని చంద్రబాబు నిలదీశారు.
జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని, కక్ష కట్టి మరీ రాజధాని అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు చంద్రబాబు. హైదరాబాద్‌లా అమరావతిని అభివృద్ధి చేయాలని భావించానన్న చంద్రబాబు.. వైసీపీలో కూడా కొందరు మంచివాళ్లు, కొందరు రౌడీలు ఉన్నారని తెలిపారు. రౌడీలు మనకు వద్దని, మంచివాళ్లు టీడీపీలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని చంద్రబాబు సూచించారు.












Click it and Unblock the Notifications