నాకు రెండు బాధ్యతలు, ఆ ప్రభావం జీవితాంతం ఉంటుంది: దిశానిర్దేశంలో చంద్రబాబు
తిరుపతి: తనకు రెండు బాధ్యతలున్నాయని, వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నానని తెలిపారు.
తిరుపతిలో రెండో రోజు జరుగుతున్న మేథోమథన సదస్సులో శనివారం చంద్రబాబునాయుడు మాట్లాడారు. టిడిపిలో అందరూ కుటుంబ సభ్యుల్లా ఉండాలని, నేతల మధ్య భేషజాలు లేకుండా ఉండాలని సూచించారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నెలాఖరులోపు సమన్వయ కమిటీలను నియమించాలన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, జిల్లా అధ్యక్షుడి మధ్య సమన్వయం అవసరమని సీఎం సూచించారు.పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల మనోభావాలను గుర్తించాలని చెప్పారు. పటిష్ఠమైన యంత్రాంగమే టీడీపీ బలం అని చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది 40వేల మందికి నాయకత్వ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

నాయుకులు పోయినా.. కార్యకర్తలు పార్టీ జెండాలను వదల్లేదని చెప్పారు. 35ఏళ్ల నుంచి కార్యక్రమ శిక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయని తెలిపారు. ఏడాదిలో రెండు రోజుల శిక్షణ అవసరమని, ఈ రెండ్రోజుల్లోనే నాయకత్వ లక్షణాలను నేర్పడం జరుగుతుందని చెప్పారు.
మీ కోసం పాదయాత్రలో రైతుల కష్టాలను స్వయంగా చూశాన్నన్న సీఎం ఇప్పటికీ ఆ దృశ్యాలు తన కళ్ల ముందు మెదులుతున్నాయని గుర్తుచేసుకున్నారు. ఆ ప్రభావం తన జీవితాంతం గుర్తుంటుందని అన్నారు.
జనచైతన్య యాత్రలో భాగంగా ప్రజలతోనే ఉండాలని, ప్రజల కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ స్థాపించిన 9నెలల్లోనే అధికారం చేపట్టడం అనేది ప్రపంచం ఎక్కడా జరగలేదని, అలాంటి పార్టీ ఎక్కడలేదని చెప్పారు. అది టిడిపికి, ఎన్టీఆర్‌కే సాధ్యమైందని అన్నారు. టిడిపి ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.
తనకంటే ఎక్కువగా ప్రజల సమస్యలను అధ్యయనం చేసిన మరో వ్యక్తి లేరని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోత లేకుండా చేసిన ఘనత తమదేనని చెప్పారు. కాగా, తకుముందు జిల్లాల వారీగా పార్టీ నేతలను వేర్వేరుగా పిలిపించుకుంటున్న చంద్రబాబు ఆయా జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై వివరాలు సేకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications