జూన్ 8న చంద్రబాబు ప్రమాణం: జయలలిత హాజరు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో, గతంలో యువ గర్జన జరిగిన ప్రదేశంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
దీనికిముందు జూన్ మొదటి వారంలో తిరుపతిలో జరిగే తెలుగుదేశం శాసనసభా పక్షం (టిడిఎల్పీ) సమావేశంలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార సభకు బిజెపి అగ్రనేతలతోపాటు ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరవుతారని తెలుస్తోంది.

గత సంప్రదాయానికి భిన్నంగా చంద్రబాబు ఈసారి ప్రజల మధ్యన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు గతంలో రెండు సార్లు రాజ్‌భవన్‌లోనే ప్రమాణ స్వీకారం చేశారు.
చంద్రబాబు జన్మ నక్షత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపాయింటెడ్ తేదీని దృష్టిలో ఉంచుకుని, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దివ్యమైన ముహూర్తం పెట్టామని ప్రముఖ సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ చెప్పారు. ఆ ముహూర్తం తేదీ, సమయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న గడియలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications