జగన్ సాక్షి ఎఫెక్ట్: రూ.5 కోట్ల లంచంపై టిడిపి ఎమ్మెల్యేకు బాబు క్లాస్!
నెల్లూరు: రైల్వే కాంట్రాక్టరును బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కే రామకృష్ణ పైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
ఎమ్మెల్యే వ్యవహార శైలి పైన ఆయన మండిపడ్డారని తెలుస్తోంది. వెంకటగిరి నియోజకవర్గంలో రైల్వే పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే కే రామకృష్ణ బెదిరించారని, పనులను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి.
అలాగే, ఎమ్మెల్యే తనను బెదిరించారని, పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారని కాంట్రాక్టర్ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

అడ్డుకుంటారా అని బాబు ఆగ్రహించారు
అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఏమిటని, ఎమ్మెల్యేలే ఇలా వ్యవహరిస్తే ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటారని ఆయన ప్రశ్నించారని తెలుస్తోంది. ఈ ఆరోపణలు నిజమో కాదో సమాచారం సేకరించాలని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారని తెలుస్తోంది.

వివరణ కోరిన పార్టీ
ఎమ్మెల్యేను తన వద్దకు పిలిపించాలని చెప్పారు. ఈ ఘటన పైన వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు పార్టీ కార్యాలయం లేఖ కూడా పంపించిందని తెలుస్తోంది.

సాక్షి పత్రికల దగ్ధం
ఇదిలా ఉండగా, ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే పనుల్లో గ్రామాలకు ఇవ్వవలసిన రాయల్టీని ఎగ్గొట్టేందుకే దుష్ప్రచారం చేస్తున్నారని సబ్ కాంట్రాక్టు మేడికొండ కన్‌స్ట్రక్షన్ మాజీ ప్రాజెక్టు మేనేజర్ తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే రామకృష్ణ రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.28 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టేందుకే ఎమ్మెల్యేపై బురద జల్లుతున్నారన్నారు.ఎమ్మెల్యే తీరు పైన సాక్షి పత్రికలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు వెంకటగిరి నియోజకవర్గంలో సాక్షి పత్రికలను దహనం చేశారు.

ఏం జరిగింది?
వెంకటగిరి నియోజకవర్గంలో రైల్వే పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను ఎమ్మెల్యే కే రామకృష్ణ బెదిరించారని, పనులను అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్ నుంచి రూ.5కోట్లు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.5 కోట్లు ఇవ్వకపోవడంతో పనులు ఆపివేయించారని మాంటేకార్లా కంపెనీ సెక్రటరీ సోమవారం ఆరోపించారు. దీనిపై సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications