ప్రత్యేక హోదాపై చంద్రబాబు యూటర్న్: స్నేహం చిగురిస్తోందా?
అమరావతి: ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదాపై రాష్ట్రానికి ఏం వస్తాయని ఆయన ప్రశ్నించారు. దీన్నిబట్టి బిజెపితో తెలుగుదేశం పార్టీ స్నేహం మళ్లీ చిగురిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టుకు రూ. 40 వేల కోట్లు కావాలని, లోటు బడ్జెట్ కింద రూ.16 వేల కోట్లు రావాలని, ఇవన్నీ హోదా వల్ల రావని ఆయన అన్నారు. చట్టంలో చెప్పినట్లు ఒక హక్కుగా మాత్రమే హోదా కావాలంటున్నామని ఆయన అన్నారు.

అది చూపించలేకపోతున్నారు....
హోదా ఇవ్వలేమంటున్నారు కాబట్టి దానికి సమానమైన ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించామని చంద్రబాబు అన్నారు. హోదాతో ఏ రాయితీలు వస్తాయని ఏ జీవోలో ఉందో చూపాలంటే చూపలేకపోతున్నారని ఆయన పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Recommended Video


కొందరు మభ్య పెడుతున్నారు...
హోదా వస్తే పరిశ్రమలకు రాయితీలు వస్తాయని కొందరు మభ్యపెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. హోదా వల్ల రాయితీలు వస్తాయని ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క జీవో చూపించలేకపోతున్నారని అన్నారు. కానీ ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు తమకు కూడా దాన్ని ఇవ్వాలని అడుగుతున్నామని ఆయన వివరించారు.

సంకీర్ణమై ఉంటే...
విభజన చట్టంలో పెట్టినవాటిని, పార్లమెంటులో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము కేంద్రాన్ని కోరుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉందని, సంకీర్ణ ప్రభుత్వం ఉండి ఉంటే కొంత ఒత్తిడి పెట్టడానికి అవకాశం ఉండేదని, బంద్‌లు, గొడవల వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇచ్చిన హామీలను సాధించుకోవడానికి నిర్మాణాత్మకంగా అందరం పోరాడాలని అన్నారు.

పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి...
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఇక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకని బిజెపి నేతలు అంటున్నారని, అది సరికాదని చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి కేంద్రం తన బాధ్యత నెరవేర్చకపోతే ఎలా అని ఆయన అడిగారు. రాష్ట్రంలో బిజెపి, కాంగ్రెసు పార్టీలు లేవని అన్నారు. మళ్లీ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియయదని అన్నారు.












Click it and Unblock the Notifications