సొంత ఇలాకాలో చుక్కలేనా?: కొడాలి నానికి చెక్ పెట్టేందుకు బాబు పావులు!
గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆ తర్వాత వైసిపిలో చేరిన కొడాలి నాని పైన తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని అంటున్నారు.
విజయవాడ: గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆ తర్వాత వైసిపిలో చేరిన కొడాలి నాని పైన తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని అంటున్నారు. కొడాలి నాని నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు మంచి స్నేహితుడు అనే విషయం తెలిసిందే.
అలాంటి నాని అప్పట్లో టిడిపి నుంచి వైసిపిలో చేరిన సమయంలో రాజకీయ వేడి రాజుకుంది. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నాని.. చంద్రబాబు, టిడిపి పైన నిప్పులు చెరుగుతున్నారు. తన నియోజకవర్గమైన గుడివాడలో ఆయనకు మంచి పట్టు ఉంది.
ఈ నేపథ్యంలో ఆయనను సొంత నియోజకవర్గం నుంచి దెబ్బకొట్టేందుకు టిడిపి పావులు కదుపుతోందని అంటున్నారు. గత కొంత కాలంగా గుడివాడలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు.

కొడాలికి చెక్ పెట్టేందుకు పావులు
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ప్రొటోకాల్ ఇంచార్జిగా నియమించారు. ఇది చర్చనీయాంశంగా మారింది. గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కొడాలి నానిని రాజకీయంగా ఎదుర్కొనేందుకు టీడీపీ పకడ్బందీ వ్యూహ రచన చేస్తోందని అంటున్నారు.

ఆఫీస్ ఖాళీ నుంచి మొన్నటి గొడవ వరకు..
గతంలో కొడాలి నాని కార్యాలయం ఖాళీ చేయించిన వ్యవహారంలో వివాదం చోటు చేసుకోగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుడివాడ వచ్చి టీడీపీకి అండగా నిలిచారు. శనివారం వైసీపీ - టిడిపి మధ్య వివాదం చోటు చేసుకుంది. శనివారం నాటి ఘటనతో కొడాలి నాని, వైసిపి ఆత్మరక్షణలో పడిందని అంటున్నారు.

ఇంఛార్జిగా..
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రొటోకాల్ ఇంచార్జిగా బుద్దా వెంకన్నను నియమించారని చెబుతున్నారు. ప్రోటోకాల్ ప్రకారం జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని పాల్గొనాల్సి ఉంది. ఆయనతోపాటు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు కూడా పట్టణంలో జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించక తప్పదు. చైర్మన్ యలవర్తి గతంలోనే వైసిపి నుంచి టిడిపిలో చేరారు.

నానిని కట్టడి చేసేందుకు బాబు పావులు
జన్మభూమి కార్యక్రమాలు వివాదాలకు అతీతంగా నిర్వహించేందుకు బుద్దా వెంకన్నను ప్రొటోకాల్ ఇంచార్జిగా నియమించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. గుడివాడ నియోజకవర్గంలో నానిని కట్టడి చేసేందుకు టిడిపి అధిష్టానం ప్రధానంగా దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీని పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది.

గుడివాడపై క్రమంగా పట్టు
అంతేకాదు, అప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర రావు టిడిపిలో చేరడం వంటివి కూడా పార్టీకి కలిసి వస్తున్నాయని అంటున్నారు. ఆయా మండలాల్లో పార్టీ బలోపేతం అయ్యే దిశలో టిడిపి పావులు కదుపుతోందని అంటున్నారు. అలాగే, అభివృద్ధి పనులు చేస్తూ కొడాలి నానిని దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications